బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర రోడ్లుభవనాల శాఖ ఈఎన్సీ వసంత నాయక్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం శనివారం ఆలమారి సందర్శించి ప్రతిపాదిత అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. ఆలయ ఈవో అంజనీదేవి, స్థపతి మోతిలాల్, ఆర్కిటెక్ట్ మాధవీలతతో కలిసి గర్భగుడి పరిసరాలు, బాలాలయం, క్యూలైన్లు, అక్షరాభ్యాస మండపం తదితర ప్రాంతాలను పరిశీలించారు. పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసే అంశంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం అధికారులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వదించారు.


