భైంసారూరల్: మండలంలోని దేగాం గ్రామంలో భైంసా–బాసర జాతీయ రహదారిపై వాలేగాం గ్రామస్తులు శుక్రవారం రాస్తారోకో చేశారు. వాలేగాంలో ప్రభుత్వ భూములకు అక్రమంగా పట్టాలు మంజూరు చేసి నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేశారని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, అక్రమంగా మంజూరైన పట్టాలను రద్దు చేసి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ పట్టాలపై అధికారులు వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న భైంసా తహసీల్దార్ శశిభూషణ్, ఎస్సై సుప్రియ సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులతో చర్చించి రాస్తారోకో విరమింపజేశారు.


