ప్రజాధనం వృథా కావొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రజాధనం వృథా కావొద్దు

Jul 3 2026 11:50 PM | Updated on Jul 3 2026 11:50 PM

● అర్హులకు పథకాలు అందాలి ● అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలి ● ఎంపీ గోడం నగేష్‌ ‘దిశ’ నిర్దేశం ● కలెక్టరేట్‌లో సమావేశం

నిర్మల్‌: ‘వివిధ పథకాల పేరిట కోట్లు ఖర్చుపెడుతూనే ఉన్నాం. ఏ పథకం వచ్చినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. సమస్యలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ప్రజాధనం వృథా అవుతోంది..’ అని ఎంపీ నగేష్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని, అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి ఫలాలు అందించాలని ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం ఎంపీ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా, నిర్మల్‌, ముధోల్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రామారావు పటేల్‌, వెడ్మ బొజ్జుపటేల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

శాఖల వారీగా సమీక్ష...

ఏడాది కాలంగా వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, పెండింగ్‌ పనులు, ఆర్థిక పురోగతిపై శాఖల వారీగా ప్రజాప్రతినిధులు సమావేశంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఒక్కో శాఖ అధికారి ద్వారా వివరంగా అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనుల కేటాయింపులపై అభ్యంతరాలను తెలిపారు. ‘ఏరువాక–మన ఊరు మన చేను’ కార్యక్రమం, బ్యాంకు లింకేజీ, పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, వ్యవసాయ శాఖ ద్వారా పీఎంకేఎస్‌వై అమలు, యూరియా నిల్వలు, విద్యుత్‌ శాఖ మౌలిక సదుపాయాలు, వైద్య ఆరోగ్య శాఖ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, విద్యాశాఖ సర్వ శిక్ష అభియాన్‌, పీఎం శ్రీ, మధ్యాహ్న భోజన పథకం, మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్‌, ఉద్యానవన, అటవీ, గిరిజన సంక్షేమ, క్రీడలు, పౌర సరఫరాలు, బీఎస్‌ఎన్‌ఎల్‌, నేషనల్‌ హైవే, లీడ్‌ బ్యాంక్‌ తదితర శాఖల పనితీరును సమీక్షించారు.

పారదర్శకంగా అందిస్తాం..

జిల్లాలో అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా పేర్కొన్నారు. జిల్లాలో రెవెన్యూ మ్యాప్‌లు లేని 14 గ్రామాల్లో సర్వేలు, 70 గ్రామాల్లో రీ–సర్వే చేపడుతున్నట్లు వెల్లడించారు. సమావేశంలో శాఖల వారీగా ఆయా అధికారులు తమ పురోగతిని వివరించారు. సమావేశంలో ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అంకం మౌనిక, భైంసా మున్సిపల్‌ చైర్మన్‌ దత్తాద్రి, అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్‌, డీఎఫ్‌వో సుశాంత్‌ సుఖదేవ్‌ బోబడే, డీఆర్వో రాథోడ్‌ రమేష్‌, డీఆర్డీవో విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement