కుంటాల: అర్హులైన విద్యార్థులకు వసతితోపాటు భోజనం అందించేందుకు గతంలో కుంటాలలో ఎస్సీ వసతి గృహం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఇందులో వసతి కల్పించారు. అప్పట్లో ప్రవేశాలు లేకపోవడంతో 2016లో వసతి గృహాన్ని ఎత్తేశారు. ప్రస్తుతం ఆ భవనంలో తహసీల్దార్ కార్యాలయం కొనసాగుతోంది.
చదువులకు విద్యార్థులు దూరం..
ప్రస్తుతం కుంటాలలో బీసీ వసతి గృహం ఉంది. ఇందులో 100 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా అదనంగా మరో 15 మందికి అవకాశం కల్పించారు. కుంటాలలో ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులు చదివేందుకు అవకాశంఉన్నా.. బాలురకు హాస్టల్ వసతి లేదు. మండలంలోని ఆయ గ్రామాల్లోని విద్యార్థులు కుంటాల ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత, ఆదర్శ పాఠశాలల్లో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. వసతి సౌకర్యం లేక సుమారు 60 మంది విద్యార్థులు వెనుదిరిగి వెళ్లారు. దీంతో విద్యార్థులు చదువుల దూరం అవుతున్నారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అధికారుల స్పందించి బీసీ బాలుర వసతి గృహాన్ని ప్రారంభించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం..
ఎస్సీ వసతి గృహం లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్‌తోపాటు సాంఘిక సంక్షేమ అధికారి దృష్టికి తీసుకెళ్లాం. వసతి గృహాన్ని తిరిగి ప్రారంభిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుంది.
జక్కల గజేందర్, సర్పంచ్, కుంటాల


