భైంసా మార్కెట్‌లో అర్బన్ ఏవో పోస్టు ఎత్తివేత సీనియర్‌ను కాదని జూనియర్ ఏవోకు ఇన్‌చార్జి బాధ్యతలు కొరవడుతున్న పర్యవేక్షణ.. నష్టపోతున్న రైతులు
గాడితప్పిన
భైంసా పట్టణంలోని కిసాన్‌గల్లికి చెందిన ఓ రైతు పట్టణంలోని గాంధీగంజ్‌లోని ఓ విత్తన దుకాణంలో తేజస్వితోపాటు మరో రకానికి చెందిన సోయా విత్తనాలు కొనుగోలు చేశారు. వాటిని విత్తగా తేజస్వి సోయా విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో డీలర్‌ను నిలదీయగా వేరే రకం సోయా విత్తనాలు ఇచ్చినట్లు తెలిసింది. పొరుగున ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోనూ ఈ రకం విత్తనాలు మొలకెత్తకపోతే కలెక్టర్ చొరవ తీసుకుని రైతులకు పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకున్నారు. భైంసా వ్యవసాయాధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
భైంసా పట్టణంలో పలు ఎరువుల విక్రయ దుకాణాల్లో డీఏపీ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ విషయం కలెక్టర్ భవేశ్ మిశ్రా దృష్టికి వెళ్లడంతో పట్టణంలోని ఓ ఎరువుల దుకాణం లైసెన్స్ సస్పెండ్ చేశారు. మరో ఆరుగురికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు.
భైంసా మార్కెట్‌లో తెలంగాణ రాష్ట్రంలో అనుమతి లేని విత్తనాలు (ప్రిన్సిపల్ సర్టిఫికెట్) లేని విత్తనాలు ఎన్నో అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. దుకాణాల్లో తనిఖీలు జరపాల్సిన స్థానిక అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
భైంసా టౌన్: డివిజన్ కేంద్రమైన భైంసా మార్కెట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్. భైంసా మండలంతోపాటు నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయడానికి భైంసాకు వస్తుంటారు. సరిహద్దు ప్రాంతం కావడంతో మహారాష్ట్ర నుంచి కూడా రైతులు విత్తనాల కోసం వస్తుంటారు. ఒక్క భైంసా పట్టణంలోనే ఏటా రూ.400 కోట్ల వ్యాపారం జరుగుతోంది.
అర్బన్ ఏవో పోస్టు ఖాళీ..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భైంసా వ్యవసాయ మార్కెట్ అత్యంత కీలకమైంది. భైంసా మండల పరిధిలో దాదాపు 75కి పైగా ఎరువులు, విత్తనాల డీలర్ దుకాణాలు ఉన్నాయి. మండలంలో 33 గ్రామాల్లో 55 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీంతో దుకాణాలపై పర్యవేక్షణ, రైతులకు అందుబాటులో ఉండేందుకు 2008లో ప్రభుత్వం అర్బన్ ఏవో పోస్టును మంజూరు చేసింది. ఈ పోస్టు పరిధిలో 75 దుకాణాలు ఉన్నాయి. నాణ్యమైన విత్తనాలు అందేలా చూడడం, అధిక ధరలకు విక్రయించకుండా చూడడం, రాష్ట్రేతర ప్రాంతాలకు విత్తనాలు, ఎరువులు తరలిపోకుండా పర్యవేక్షించడం ఈ అధికారి బాధ్యత.
జూనియర్‌కు ఏడీఏ బాధ్యతలు..
భైంసా ఏడీఏగా పనిచేసిన వీణ గత నెలలో ఉద్యోగ విరమణ చేశారు. దీంతో జిల్లా కార్యాలయంలో సీనియర్ ఏవోలు ఉండగా వ్యక్తిగత కారణాలతో జూనియర్ ఏవోకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఈ విషయంపై జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్‌ను సంప్రదించగా ఆయన స్పందించలేదు.
అర్బన్ ఏవో పోస్టు పునరుద్ధరణకు డిమాండ్
ప్రస్తుతం ఖాళీగా ఉన్న అర్బన్ ఏవో పోస్టును తిరిగి భైంసా కార్యాలయానికే కేటాయించాలని రైతులు కోరుతున్నారు. భైంసా వంటి పెద్ద మార్కెట్ ఉన్న చోట సీనియర్ ఏఓను నియమించడం వల్ల విత్తనాలు, ఎరువుల విక్రయాలపై సరైన పర్యవేక్షణ ఉంటుందని, రైతులకు నాణ్యమైన వస్తువులు అందేలా చూడవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. కలెక్టర్, ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పరిశీలించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
పోస్టు పునరుద్ధరిస్తేనే..
భైంసాలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న అర్బన్ ఏవో పోస్టును తిరిగి భైంసా కార్యాలయానికే కేటాయించాల్సిన అవసరం ఉంది. భైంసా వంటి పెద్ద మార్కెట్ ఉన్న చోట సీనియర్ ఏఓను నియమించ డం ద్వారా విత్తన, ఎరువుల విక్రయాలపై సరైన పర్యవేక్షణ ఉంటుంది. తద్వారా రైతులకు నాణ్యమై న విత్తనాలు, ఎరువులు అందేలా చూడవచ్చు. కలెక్టర్, ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పరిశీలించి, భైంసా మండల రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
భైంసాలోని ఏడీఏ కార్యాలయం
పోస్టు ఎత్తివేతతో నష్టం..
అయితే పలు అక్రమాల ఆరోపణలు ఉన్న జిల్లా వ్యవసాయ అధికారి వ్యక్తిగత కారణాలతో అర్బన్ ఏవో పోస్టు అవసరం లేదని ప్రభుత్వానికి లేఖ రాసి, ఆ పోస్టును డీఏవో కార్యాలయానికి తరలించారు. దీంతో స్థానిక రైతులకు తీరని నష్టం జరుగుతోంది. రూరల్ పరిధిలోని 33 గ్రామాలు, 75 దుకాణాల పర్యవేక్షణతోపాటు 9 మంది ఏఈఓల పనితీరుపై పర్యవేక్షణ కొరవడింది. క్షేత్రస్థాయిలో నాణ్యమైన పర్యవేక్షణ లోపిస్తోంది. విత్తనాల నాణ్యత లోపం కారణంగా రైతులు నష్టపోతున్నారు. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తుండటంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది.


