ఇంత దారిద్య్రమా! | - | Sakshi
Sakshi News home page

ఇంత దారిద్య్రమా!

Jul 3 2026 1:58 AM | Updated on Jul 3 2026 1:58 AM

అధ్వానంగా అంబుగాం రహదారి

దశాబ్దాలుగా ప్రజల ఇబ్బందులు

ఎన్నికల సమయంలో నేతల హామీలు..

భైంసా/కుంటాల: జిల్లాలోని కుంటాల మండలం అంబుగాం గ్రామానికి రహదారి సమస్య దశాబ్దాలుగా ప్రజలను వేధిస్తోంది. గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. ఈ సమస్యను ఎన్నికల సమయంలో నేతలు తమ ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. తమను గెలిపిస్తే రోడ్డు వేయిస్తామని హామీ ఇస్తున్నారు. గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదు. దీంతో తాజాగా గ్రామ యువకులు సోషల్‌ మీడియా వేదికగా రోడ్డు దుస్థితిపై ఓ వీడియో విడుదల చేసి మరోసారి గ్రామ రోడ్డు దుస్థితిని వెలుగులోకి తెచ్చారు. పాలకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

అధ్వాన్నంగా ప్రధాన రహదారి..

అంబుగాం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. వర్షాకాలంలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు, రైతులు, వృద్ధులు, గర్భిణులు, అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

శ్రమదానంతో తాత్కాలిక మరమ్మతు..

గత వర్షాకాలంలో గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రమదానం చేసి రహదారిని తాత్కాలికంగా మరమ్మతు చేశారు. మట్టి, మురుగు, కంకరతో గుంతలు పూడ్చి రాకపోకలకు అనువుగా మార్చే ప్రయత్నం చేశారు. అయితే భారీ వర్షాలకు ఆ తాత్కాలిక నిర్మాణం కొట్టుకుపోవడంతో ప్రస్తుతం రోడ్డు మళ్లీ పాడైపోయింది. ప్రజలే సొంత డబ్బులు వెచ్చించి రోడ్డు మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి నెలకొనడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నెరవేరని వాగ్దానాలు..

ఈ సమస్యపై గతంలో కూడా పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. రోడ్డు అభివృద్ధి కోసం నిధులు మంజూరైనట్లు ప్రకటించినప్పటికీ పనులు జరగలేదని గ్రామస్తులు తెలిపారు. ప్రతీ ఎన్నికల సమయంలో నేతలు హామీలు ఇస్తున్నా, ఎన్నికలు ముగిసిన తర్వాత గ్రామ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌..

తమ ఊరి రోడ్డు సమస్యపై అధికారుల స్పందన కోరుతూ తాజాగా సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ చేస్తున్నారు గ్రామ యువకులు. ఈ వీడియోలో యువకులు రహదారి దుస్థితిని చూపిస్తూ ప్రభుత్వం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరారు. గ్రామ అభివృద్ధికి కీలకమైన రహదారి నిర్మాణాన్ని వెంటనే చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు.

సోషల్‌ మీడియా వేదికగా పాలకుల దృష్టికి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement