మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో అందించిన బ్రేక్‌ఫాస్ట్‌కు సంబంధించి పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది. 2023–24 విద్యాసంవత్సరం బిల్లులు మంజూరు చేయడం వంట కార్మికులకు ఊరటనిచ్చింది. నెలల తరబడి అల్పాహారం నిధులు అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం విడుదల చేసిన నిధులను జిల్లా విద్యాశాఖ అధికారులు వంట కార్మికులకు త్వరితగతిన చెల్లింపులు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు, హాజరు శాతం పెంచేందుకు 2023–24లో దసరా కానుకగా సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం అమల్లోకి వచ్చింది. ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఈ పథకంలో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరింది. చాలామంది పిల్లలు దూర గ్రామాల నుంచి వచ్చి చదువుకుంటుండగా అల్పాహారం ఉపయుక్తంగా మారింది. పథకానికి సంబంధించిన బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండడంతో పూర్తిగా నిలిపివేశారు. తాజాగా పెండింగ్ బిల్లుల విడుదలతో వంట కార్మికులకు ఉపశమనం కలిగిస్తోంది. మంచిర్యాల జిల్లాలో మొదట న్యూగర్మిళ్ల, చెన్నూర్ నియోజకవర్గంలో మందమర్రి ఫిల్టర్‌బెడ్ ఎంపీపీఎస్, బెల్లంపల్లి నియోజకవర్గంలో 2ఇంకై ్లన్ ఎంపీపీఎస్‌లో పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. మరికొన్ని రోజులకు మరో 36 పాఠశాలల్లో అమల్లోకి వచ్చింది. నిధుల మంజూరులో ఇబ్బందులతో పథకం నిలిచిపోగా.. విద్యార్థులు ఉదయం పస్తులతోనే పాఠశాలకు రావాల్సి వస్తోంది.
మెనూ ఇలా..
పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు 45 నిమిషాల ముందు అల్పాహారం అందించేవారు. సోమవారం ఇడ్లీ, సాంబారు లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ, మంగళవారం పూరి, ఆలుకుర్మా లేదా టమాటా బాత్, సాంబార్, బుధవారం ఉప్మా, సాంబారు లేదా బియ్యం రవ్వ కిచిడీ, చట్నీ, గురువారం చిరుధాన్యాల ఇడ్ల్లీ, సాంబారు లేదా పొంగల్, సాంబారు, శుక్రవారం ఉగ్గని, అటుకులు, చిరుధాన్యాల ఇడ్లీ, చట్నీ లేదా బియ్యం రవ్వ కిచిడీ, చట్నీ, శనివారం పొంగల్, సాంబార్ లేదా కూరగాయల పులావ్, పెరుగు, చట్నీ, ఆలుకుర్మా మెనూలో పొందుపర్చారు. నిధులు మంజూరు కాకపోవడం, నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో అప్పట్లో అల్పాహారం పథకం నిలిచిపోయింది. ఎట్టకేలకు నిధులు మంజూరయ్యాయి.
నిధులు మంజూరు ఇలా..
జిల్లా నిధులు(రూ.లలో)
ఆదిలాబాద్ 97,957
నిర్మల్ 4,70,000
మంచిర్యాల 19,35,336
ఆసిఫాబాద్ 8,50,935


