బెల్లంపల్లి: బెల్లంపల్లి టేకులబస్తీలో కొత్తగా నిర్మాణం జరుగుతున్న ఇందిరమ్మ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బెల్లంపల్లి వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. టేకులబస్తీలో నివాసం ఉంటున్న మల్లెంపల్లి శంకర్‌కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణంలో భాగంగా స్లాబ్ వేయడానికి శంకర్ సిద్ధపడి అతని చెల్లెలు మల్లేశ్వరి, బావ కుమ్మరి రాము(43)ను ఇంటికి సాదరంగా ఆహ్వానించాడు. సోమవారం ఇందిరమ్మ ఇంటికి స్లాబ్ వేశారు. అనంతరం ఇంటిళ్లిపాది బంధుమిత్రులతో కలిసి విందు భోజనం చేశారు. చీకటి పడ్డాక రాము ఇంటి శ్లాబ్ ఎక్కి కింద పడిపోయాడు. అర్ధరాత్రి గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని ఎస్‌హెచ్‌వో సందర్శించి పంచనామా నిర్వహించారు. మృతుడి భార్య మల్లేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎడ్లబండి పైనుంచి పడిన రైతు మృతి
చెన్నూర్‌రూరల్: మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన బండం రవీందర్‌రెడ్డి(57) అనే రైతు ఎడ్లబండి పైనుంచి పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవీందర్‌రెడ్డి జూన్ 16వ తేదీన వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయం ఎడ్లబండిపై వెళ్తున్న క్రమంలో అకస్మాత్తుగా కింద పడిపోయాడు. దీంతో అతనికి మెడ విరిగి పోగా నడుము కూడా దెబ్బతింది. వెంటనే మంచిర్యాలకు, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కూడా నయం కాకపోగా వైద్యులు సూచనల మేరకు ఇంటికి తీసుకొచ్చారు. ఈక్రమంలో మంగళవారం ఇంటి వద్ద రవీందర్‌రెడ్డి మృతి చెందాడు. అతనికి భార్య లక్ష్మితో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని కుమార్తె బొమ్మ మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
విద్యుత్ షాక్‌తో షోరూం కార్మికుడు..
ఆదిలాబాద్‌రూరల్: మావల పోలీస్‌స్టేషన్ పరిధిలోని దస్నాపూర్ కాలనీలో గల టీవీఎస్ షోరూంలో కార్మికుడిగా పని చేస్తున్న కుంట రమణ గౌడ్ (38) మంగళవారం విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. టీవీఎస్ షోరూంకు వాహనాల లోడ్‌తో వచ్చిన లారీకి రమణ గౌడ్ సైడ్ చూపిస్తుండగా, లారీకి విద్యుత్ వైర్లు తగిలాయి. ఈక్రమంలో లారీని పట్టుకున్న రమణకు విద్యుత్‌షాక్ తగిలి కింద పడిపోయాడు. వెంటనే చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దుబాయ్‌లో వలస కార్మికుడు..
నిర్మల్‌ఖిల్లా: జిల్లాలోని సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన వలస కార్మికుడు శివరాత్రి నర్సింహులు(44) దుబాయ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నర్సింహులు కుటుంబ పోషణ, ముగ్గురు పిల్లల చదువుల భారం కారణంగా గత ఏడాది దుబాయ్‌కు ఉపాధి నిమిత్తం వెళ్లాడు. ఇటీవల పనిలో ఉండగా ఛాతినొప్పి రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అనంతరం గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అనారోగ్యం తీవ్రరూపం దాల్చడంతో ఆదివారం మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆయన పనిచేస్తున్న సంస్థ ప్రతినిధులు మంగళవారం ఉదయం మృతుడి భార్య లక్ష్మికి ఫోన్ ద్వారా తెలియజేశారు. సారంగపూర్ గ్రామ సర్పంచ్ కునేరు భూమన్న, కుటుంబ సభ్యులతో కలిసి ఎన్‌ఆర్‌ఐ రాష్ట్ర సలహా మండలి సభ్యుడు స్వదేశ్ పరికిపండ్లను జిల్లాకేంద్రంలో కలిసి మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తరలించేందుకు సహకరించాలని కోరారు. ఆయన దుబాయ్‌లోని సామాజిక కార్యకర్త గుండెల్లి నర్సింహతో ఫోన్‌లో మాట్లాడి మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించారు. స్వదేశ్‌ను కలిసిన వారిలో సారంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు సామల వీరయ్య, శివరాత్రి గురుస్వామి, దండుగుల పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ రైతు..
నర్సాపూర్(జి): మద్యం మత్తులో పురుగుల మందు తాగిన రైతు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్(జి) మండల కేంద్రానికి చెందిన అరుల్ల నాగరాజు (52) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వ్యవసాయ పనుల నిమిత్తం ఆదివారం కొత్త ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అప్పులు ఉన్నాయని కొత్తగా ట్రాక్టర్ ఎందుకు కొనుగోలు చేశావని భార్య సత్యమ్మ మందలించింది. అదేరోజు రాత్రి బయటకు వెళ్లి మద్యం సేవించి ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లాడు. క్షణికావేశంలో తాగిన మత్తులో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నిర్మల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలించారు. సోమవారం నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మంగళవారం భార్య సత్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు.


