కెరమెరి: గిరి గూడేల్లో అకాడి సంబురాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీలు తమ గూడేల్లో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ పండుగ తర్వాతనే ఆదివాసీలు ఇతర పండుగలు జరుపుకుంటారు. గూడెల్లో ప్రారంభమైన అకాడి పండుగ గురుపౌర్ణిమ నాటికి ముగుస్తుంది. అనాధిగా వస్తున్న ఆచారాలను ఆదివాసీలు నేటికీ పాటిస్తున్నారు. చినుకు రాలినా.. దుక్కి దున్నినా, విత్తనాలు వేసినా.. వానలు కురవక పోయినా.. పంటలు చేతికొ చ్చినా.. ప్రత్యేక పూజలు చేస్తారు. ఆషాఢ మాసంలో నెలవంక కనిపించడంతో ప్రారంభమయ్యే అకాడి పండుగను 15 రోజులు నిర్వహిస్తారు.
ప్రథమ పండుగ అకాడి
ఆషాఢ మాసంతో ప్రారంభమయ్యే పండుగల్లో ప్రథమంగా వచ్చే పండుగ అకాడి. వేడుకల్లో భాగంగా గ్రామం నుంచి పులిమేరలో ఉండే బాబ్రి చెట్టు వద్దకు వెళ్లి చెట్టుకింద ఉన్న పవిత్ర దేవతలను శుద్ధి చేసిన అనంతరం పుసుపుతో గీతలు గీశారు. అనంతరం పాడిపశువులకు రక్షణ కల్పించే దేవతగా కొలిచే రాజుల్ పేన్‌కు ప్రత్యేక పూజలు చేశారు. వనంలోనే భోజనం తయారు చేసి నైవేద్యం సమర్పించారు. అక్కడే వనభోజనాలు చేశారు. తర్వాత లక్ష్మణ రేఖ గీతను గీసి గీతపై నుంచి పశువులను అడవుల్లోకి తరలించారు. అడవుల్లోని చెట్ల ఆకులను దేవునిగా భావించి అకాడి పేన్ పూజ చేశాక ఆకులను ఇంటికి తీసుకెళ్లారు.
తుర్ర వాయించాల్సిందే..
ఆదివాసీలు ఆచార వ్యవహారాల్లో భాగంగా ప్రతీ ఇంటి నుంచి ఒక్కో కోడిని కొనుగోలు చేసి దేవతకు బలిచ్చారు. కోడి తమ జాతకం చెబుతుందని నమ్ముతారు. అలాగే అడవిలోకి వెళ్లిన పశువులు తిరిగి ఇళ్లకు చేరాలంటే తుర్ర వాయించాలనేది వారి ఆచారం. పశువులు ఎక్కడికి వెళ్లినా ఈ తుర్ర వా యిస్తే పశువులు తిరిగి వస్తాయని వారి నమ్మకం.
ఏత్మాసార్ పేన్‌కు పూజలు
అకాడి అనంతరం గ్రామంలోకి చేరుకున్న ఆదివాసీలు ఏత్మాసార్ పేన్‌కు పూజలు చేశారు. ఇళ్లల్లో ప్రత్యేక వంటకాలు ఆరగించిన తర్వాత ఈ పూజలు ప్రారంభమయ్యాయి. ఏత్మాసార్ పేన్ పూజ నుంచి నాలుగు నెలల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అడవుల్లో వనభోజనాలు
అకాడి పూజలు చేసిన తర్వాత ఏత్మాసార్ పేన్‌కు పూజలు చేస్తాం. అనంతరం నాలుగు నెలల పాటు పూజలు చేయాల్సి ఉంటుంది. గుస్సాడీ దీక్ష స్వీకరించే వారు ఈ పండుగలో భాగంగా మొక్కుంటారు. అడవుల్లో వనభోజనాలు చేస్తాం. – ఆత్రం లక్ష్మణ్ రావు, సర్పంచ్, మోడి
రాజుల్ దేవతకు పూజలు
అకాడి పండుగ అనాధి నుంచి వస్తున్న ఆచారం. ఈ పండుగ జరుపుకున్నాకే మిగితా పండుగలు చేసుకుంటాం. రాజుల్ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తాం.
– పెందోర్ దంబిరావు, కటోడా, సాకడ


