రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందమర్రి సీఐ పర్స రమేశ్, పట్టణ ఎస్సై శ్రీధర్‌లు వివరాలు వెల్లడించారు. బొక్కలగుట్ట గ్రామానికి చెందిన గజ్జి వెంకటేశ్(40) హత్యకు సంబంధించి అతని భార్య గజ్జి మమత ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన తన వివాహంలో వెంకటేశ్ కీలకంగా వ్యవహరించాడనే భావనతో అతనిపై నిందితుడు ఒడ్డేపల్లి రాజ్‌కుమార్ కక్ష పెంచుకున్నాడు. ఇటీవల మొబైల్ ధ్వంసమైన విషయంలో మరోసారి ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. జూన్ 28న రాత్రి గ్రామంలోని చిప్పరి శ్రీనివాస్ ఇంటి సమీపంలో వెంకటేశ్‌తో మరోసారి గొడవపడిన రాజ్‌కుమార్ అక్కడే ఉన్న సిమెంటు రాయితో అతని తలపై బలంగా బాది దాడిచేశాడు. స్థానికులు గమనించి వెంకటేశ్‌ను ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతిచెందాడని సీఐ వివరించారు. వ్యక్తిగత కక్షతోనే హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని ఈ మేరకు నిందితుడిని కుర్మపల్లి ఫ్లైఓవర్ సమీపంలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.


