సాత్నాల: నేటి కాలంలో కొందరు చిన్నచిన్న విషయాలకే మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాంటి సంఘటనే భోరజ్ మండలం లేఖర్‌వాడ గ్రామంలో చోటు చేసుకుంది. మర్రి చెట్టు వద్ద పెట్టిన తన హారతి పళ్లెం ఎవరో పక్కన పెట్టారని మనస్తాపం చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై పవర్ గౌతమ్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఏఎన్‌ఎంగా పని చేసే రుక్మ జ్యోతి(35) సోమవారం వటసావిత్రి వ్రతం ఉందని పూజ చేసేందుకు హారతి పళ్లెంతో మర్రిచెట్టు వద్దకు వెళ్లింది. అయితే అక్కడ ఎవరో తన హారతి పళ్లెం పక్కన పెట్టారని వారిని పిలిచి మందలించాలని ఇంటికి వచ్చాక భర్తతో గొడవ పడింది. భర్త రాములు ఎంత సర్ది చెప్పినా ఆమె వినలేదు. సాయంత్రం మళ్లీ అదే విషయంపై భర్తతో గొడవ పడింది. దీంతో గొడవ పెద్దది చేయడం ఇష్టం లేక రాములు జ్యోతిని తన బంధువుల ఇంట్లో వదిలేసి వచ్చాడు. రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన జ్యోతి ఇంటిపైన ఉన్న రూమ్‌లో పడుకుంది. మంగళవారం ఉదయం భర్త వెళ్లి చూడగా ఫ్యానుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పవర్ గౌతమ్ వెల్లడించారు. వారికి ఒక పాప, బాబు ఉన్నారు.


