బాసర: రెవెన్యూ శాఖలో రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కంప్యూటర్ ఆపరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టైపిస్టులుగా పనిచేస్తూ శాఖ పనితీరుకు వెన్నెముకగా నిలిచినవారు ఉద్యోగ భద్రత లేక తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. భూముల రికార్డుల నిర్వహణ, ధరణి సేవలు, ఎన్నికల విధులు, ప్రకృతి విపత్తుల సమయంలో అత్యవసర సేవల వరకు అనేక ముఖ్యమైన బాధ్యతలను వారు సమర్థంగా నిర్వర్తించారు. తాజాగా వీరిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా విధుల నుంచి తొలగించడం అన్యాయమని, రెండు దశాబ్దాల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 62 మంది..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 62, నిర్మల్ జిల్లాలో 21 మంది ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అందరినీ విధుల నుంచి తొలగించినట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మండలానికి ఒక ఆపరేటర్‌తోనే పనులు నిర్వహిస్తున్నారని, దీంతో సేవలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు.
పెండింగ్‌లో 12 నెలల వేతనాలు...
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏడాదిగా వేతనాలు రావడం లేదు. కుటుంబాల గడవడం ఇబ్బందిగా మారింది. పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, ఇంటి అవసరాలు తీర్చడం కష్టంగా మారింది. జీతాలు లేక అప్పుల పాలవుతున్నామని, కుటుంబాలను పోషించడం భారంగా మారిందని వారు వాపోతున్నారు. 20 ఏళ్లుగా రెవెన్యూ శాఖ కోసం అంకితభావంతో పనిచేశామని, ప్రతీ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించామని, ఇప్పుడు ఉద్యోగ భద్రత లేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సేవలను గుర్తించి విధుల్లో కొనసాగించాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.
ప్రజాసంఘాల మద్దతు..
దీర్ఘకాలంగా సేవలందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మానవతా దృక్పథంతో స్పందించి వేలాది కుటుంబాలకు రోడ్డున పడకుండా చూడాలని వేడుకుంటున్నారు.
బాసర తహసీల్దార్ కార్యాలయం


