కార్యదర్శులకు అందని పంచాయతీ ఎన్నికల పారితోషికాలు ఏడు నెలలు గడిచినా తప్పని ఎదురు చూపులు నాడు అప్పులు తెచ్చి పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన
నిర్మల్‌చైన్‌గేట్: గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి ఏడు నెలలు గడిచినా, నిర్వహణకు చేసిన ఖర్చులకు పూర్తి స్థాయిలో నిధులు రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం ఎన్నికల ఖర్చు సుమారు రూ.7.90 కోట్లు కాగా, ఇప్పటి వరకు 3.05 కోట్లు మాత్రమే చెల్లించారు. మరో రూ.80 లక్షలు ట్రెజరీలో ఉన్నాయి. ఇంకా రూ.4.05 కోట్ల వరకు చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం కార్యదర్శులకే సంబంధించినవి.
బదిలీల నేపథ్యంలో ఆందోళన..
ఇటీవల పంచాయతీ కార్యదర్శుల బదిలీలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం వెచ్చించిన డబ్బులు వస్తాయా లేదా అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు తమ జీతం నుంచి, మరికొందరు అప్పు తెచ్చి ఖర్చులు చేశారు. ఏడు నెలల నుంచి డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. బదిలీ అయిన వారు ఈ బకాయిలు ఎలా పొందాలని ఆందోళన చెందుతున్నారు.
మూడు దశల్లో ఎన్నికలు..
జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో 400 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. పెద్ద గ్రామ పంచాయతీలో 12 వార్డులు ఉన్న చోట సుమారు 50 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించారు. వారికి ముందు రోజు బ స, భోజనం, ఎన్నికల రోజు అల్పాహారం, మ ధ్యాహ్న భోజనం, టీలను కార్యదర్శులు ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో టెంట్లు, కుర్చీలు, టేబుల్స్ సమకూర్చారు. దీనికి ఒక్కో పంచాయతీకి సుమారు రూ.25 వేల వరకు ఖర్చయ్యాయి. కానీ ఆ కార్యదర్శికి ఇప్పటి వరకు మండల అభివృద్ధి అధికారి నుంచి రూ.10 వేలు మాత్రమే అందాయి. చిన్న పంచా యతీలకు రూ.18 వేలు ఖర్చయితే కేవలం రూ.8 వేలు చెల్లించారు. మిగిలిన నిధులు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని మండలాల్లో వీడియో గ్రాఫర్లకు కూడా డబ్బులు చెల్లించలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.
వివరాలు:
మొత్తం ఖర్చు(ప్రతిపాదన) రూ.7.90 కోట్లు
తొలి విడత రిలీజ్ నిధులు రూ.3.85 కోట్లు
ఖాతాలో జమైన నిధులు రూ.3.05 కోట్లు
ట్రెజరీలో పెండింగ్‌లో ఉన్న నగదు
రూ.80 లక్షలు
రెండోవిడత రావాల్సిన నిధులు
రూ.4.05 కోట్లు


