● వనాల పెంపకంతో భవిష్యత్తు ఆశలు
మామడ: నిర్మల్ కొయ్యబొమ్మలకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. ఈ కొయ్యబొమ్మల తయారీకి 400 ఏళ్ల చరిత్ర ఉంది. జిల్లాలోని అటవీ ప్రాంతా ల్లో పొనికి కర్ర ఎక్కువగా లభించడం, ప్రోత్సాహం ఎక్కువగా ఉండటంతో ఈ పరిశ్రమ విరాజిల్లింది. ప్రస్తుతం జిల్లాలో అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతోపాటు పొనికి కర్ర లభ్యత తగ్గిపోవడంతో కొ య్యబొమ్మల పరిశ్రమ ఇబ్బందుల్లోకి వెళ్లింది. ఈ రంగంలో ఉపాధి పొందుతున్న వారు ఇతర రంగాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొయ్యబొమ్మల తయారీకి అవసరమైన పొనికి కర్రను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం పొనికి వనాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కళాకారులు కోరుతున్నారు.
పొనికి వనాల పెంపకం..
కొయ్యబొమ్మల పరిశ్రమకు ప్రోత్సాహంగా డీఆర్డీఏ, అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మామడ, సారంగపూర్ మండలాల్లోని అటవీ ప్రాంతంలో దాదాపు పది ఎకరాల్లో పొనికి వనాలు పెంచుతున్నారు. మామడ మండలంలోని లింగాపూర్ అటవీ ప్రాంతంలో 620 మొక్కలు
రాయదారి అటవీ పరిధిలో 200 మొక్కలు, ముందరితండా అటవీ పరిధిలో 750 మొక్కలు నాటి పెంచుతున్నారు. సారంగపూర్ మండలంలోని మహబూబ్‌ఘాట్ అటవీ ప్రాంతంలో 2 వేల పొనికి మొక్కలు పెంచుతున్నారు.
పంచాయతీలకు నిర్వహణ బాధ్యత..
నాలుగు సంవత్సరాల క్రితం నాటిన పొనికి మొక్కలు ఏపుగా పెరిగాయి. ఈ మొక్కల పెంపకానికి 4 లక్షల రూపాయలు వెచ్చించారు. ఈ ఏడాది నుంచి ఈ మొక్కల నిర్వహణ బాధ్యతను ఈజీఎస్ నుంచి గ్రామ పంచాయతీలకు అప్పగించారు. దీంతో వనాల నిర్వహణ గాడితప్పింది. వేసవి కాలంలో నీటి కొరత మొక్కల పెరుగుదలపై ప్రభావం చూపింది. అధికారులు స్పందించి మొక్కలను కాపాడాలని కళాకారులు కోరుతున్నారు. కొయ్యబొమ్మల తయారీకి అవసరమైన పొనికి కర్ర సిద్ధం కావాలంటే 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో నిర్మల్ కొయ్యబొమ్మల పరిశ్రమకు కొత్త జీవం వస్తుందని కళాకారులు ఆశిస్తున్నారు.
మొక్కలు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు
ఉన్నతాధికారుల ఆదేశాలతో నాలుగేళ్ల క్రితం మండలంలోని రాయదారి, లింగాాపూర్, ముందరితండా అటవీ ప్రాంతంలో పొనికి మొక్కలు నాటించాం. వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. పది నుంచి పదిహేను సంవత్సరాలకు పొనికి కర్ర కొయ్యబొమ్మల తయారీలో వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
– శివాజీ, ఈజీఎస్, ఏపీవో, మామడ


