అభ్యాసన సామర్థ్యాలు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

అభ్యాసన సామర్థ్యాలు పెంచాలి

Jun 30 2026 11:52 PM | Updated on Jun 30 2026 11:52 PM

● కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా ● కేజీబీవీ, ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ యాప్‌, పీహెచ్‌సీ తనిఖీ

లోకేశ్వరం: విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పెరిగేలా విద్యాబోధన చేయాలని కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని కేజీబీవీ, రైతు వేదికలో ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ యాప్‌, లోకేశ్వరం పీహెచ్‌సీ, కిష్టాపూర్‌ గ్రామంలోని సుధాకర్‌రెడ్డి అనే రైతు సాగు చేసిన ఆయిల్‌పామ్‌ తోటను మంగళవారం పరిశీలించారు. ముందుగా కేజీబీవీలో తరగతి గదులను పరిశీలించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు.

గణిత ఉపాధ్యాయుడిగా..

తర్వాత పదో తరగతిలో విద్యార్థులకు గణితం బోధించారు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాల్లో వ్యత్యాసాన్ని వారికి అర్థమయ్యేలా అవగాహన కల్పించారు. విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమని, ఉత్తమ మార్కులు సాధించేలా చదవాలని సూచించారు. పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, వసతి గృహాలు, పారిశుధ్యం, తాగునీటి వసతులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీరోజు మెనూ ప్రకారం పోషకాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.

ఫార్మర్‌ రిజిస్ట్రీ తప్పనిసరి..

ఇక రైతులకు ఫార్మర్‌ రిజిస్ట్రీ తప్పనిసరని, ఇంకా నమోదు చేసుకోని రైతులను గుర్తించి వారితో వ్యక్తిగతంగా సంప్రదించి రిజిస్ట్రీ త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకొవాలన్నారు. రైతులతో మాట్లాడిన కలెక్టర్‌ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ప్రతీరైతు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు మండలంలో డీఏపీ అధిక ధరలకు విక్రయిస్తున్నారని కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. మక్కలు విక్రయించి నెలలు గడుస్తున్నా డబ్బులు రావడం లేదని తెలిపారు. వారం రోజుల్లో మక్కల డబ్బులను అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

పీహెచ్‌సీ తనిఖీ..

అనంతరం పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఓపీ వివరాలు, మందుల లభ్యత, మౌలిక వసతులపై ఆరాతీశారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. తర్వాత కిష్టాపూర్‌లో సుధాకర్‌రెడ్డి ఆయిల్‌పామ్‌ తోటను పరిశీలించారు. దిగుబడి, మార్కెట్‌ అవకాశాలపై చర్చించారు. అధిక ఆదాయాన్ని అందించే ఆయిల్‌పామ్‌ వంటి వాణిజ్య పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో భోజన్న, డీఎంహెచ్‌వో రాజేందర్‌, డీఏవో అంజిప్రసాద్‌, హార్టికల్చర్‌ అధికారి రమణ, లోకేశ్వరం తహసీల్దార్‌ సూర్యరావ్‌, ఎంఈవో చంద్రకాంత్‌, ఏంపీవో సోలమాన్‌రాజ్‌, ఏవో గిరిరాజ్‌, స్థానిక సర్పంచ్‌ కపిల్‌, ఆత్మ చెర్మన్‌ గన్ను నర్సారెడ్డి, పీఏసీఏస్‌ చెర్మన్‌ రత్నకర్‌రావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement