పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యం

Jun 30 2026 11:52 PM | Updated on Jun 30 2026 11:52 PM

● మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గణేశ్‌చక్రవర్తి

నిర్మల్‌టౌన్‌: నిర్మల్‌ పట్టణ అభివృద్ధే బల్దియా ప్రాధాన్యత అని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌ చక్రవర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంలో వైస్‌ చైర్మన్‌ అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. పట్టణ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సమావేశంలో కమిషనర్‌ రవిబాబు, డీఈ హరిభవణ్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మైనార్టీలకు కొమ్ముకాస్తున్న పాలక వర్గం

నిర్మల్‌చైన్‌గేట్‌: నిర్మల్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఒక వర్గానికే కొమ్ముకాసేలా నిర్ణయాలు తీసుకుని ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని బీజేపీ సీనియర్‌ నాయకులు రావుల రాంనాథ్‌, పట్టణ నాయకుడు సాధం అరవింద్‌ ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. 42 వార్డులలో నెలకొన్న అనేక సమస్యలను పక్కన బెట్టి కేవలం మైనారిటీ వర్గానికి కొమ్ముకాసేలా ఎజెండాలు రూపొందించడం సరికాదన్నారు. బక్రీద్‌ పండుగకు సంబంధించి బిల్లులు ఆమోదం కోసం, జిల్లా కేంద్రంలో వివాదాస్పదంగా మారిన ఈద్గా అభివృద్ధికి మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌ నుంచి రూ.50 లక్షలు కేటాయించేందుకు కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. వర్షాకాలంలో పట్టణంలోని అనేక కాలనీల్లో రోడ్ల పైకి నీరు చేరుతుందని ఇటువంటి అత్యవసర పనులపై దృష్టి సారించాలని సూచించారు. 21వ వార్డులో జనావాసాలు లేకపోయినా డ్రైనేజీ నిర్మాణానికి రూ.50 లక్షలు కేటాయించడం సరికాదన్నారు. సమావేశంలో సీనియర్‌ నాయకులు రావుల రాంనాథ్‌, సాదం అరవింద్‌, కౌన్సిలర్లు శ్రీరామోజీ నరేశ్‌, జింక సూరి, కూన శశాంక్‌, విఠల్‌, సాత్విక్‌, ముత్యం పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement