‘ఆశిం’చి.. ‘అన్వేషి’ం’చి.. సాధించారు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రూరల్ మండలం దిమ్మ గ్రామానికి చెందిన భావునే గంగాధర్–కవిత దంపతుల కుమారులు ఆశిశ్, అన్వేశ్ పోటాపోటీగా చదివి కన్నవారి కలలను నిజం చేశారు. అన్న అన్వేశ్ ఇటీవల విడుదలైన అగ్ని వీర్ జీడీకి ఎంపికయ్యాడు. నేవీ ఫలితాల్లో మెడికల్ అసిస్టెంట్ పోస్ట్ కొట్టి తమ్ముడు ఆశిశ్ సత్తా చాటాడు. రోజంతా పొలం పనుల్లో శ్రమించే అమ్మానాన్నలను స్ఫూర్తిగా తీసుకుని సరిహద్దులో సేవ చేసేందుకు నిరంతరం శ్రమించారు. ప్రణాళికతో పట్టు వదలకుండా సాధన చేస్తే ఏదైనా సాధ్యమని నిరూపించారు.
పట్టువదలని ‘వర్ధన్’
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలి గ్రామానికి చెందిన నక్కల అడెళ్లు–భీమక్క దంపతుల కుమారుడు వర్ధన్ పట్టు వదలకుండా ప్రయత్నించి ఆర్మీ కొలువు కొట్టాడు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వర్ధన్ తల్లిదండ్రుల కష్టాలను దూరం చేయాలనుకున్నాడు. డిగ్రీ చదువుతూనే లక్ష్య సాధనకు శ్రమించాడు. కఠినమైన శిక్షణతో రెండో ప్రయత్నంలో అగ్నివీర్ ఉద్యోగాన్ని సాధించి కల సాకారం చేసుకున్నాడు. కష్టపడితే విజయం కచ్చితంగా వరిస్తుందని నిరూపించాడు. వర్ధన్ సంకల్పం ఎందరికో స్ఫూర్తిదాయకం. – వర్ధన్
ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు నిరుపేద కుటుంబాలకు చెందిన యువకులు దేశ రక్షణలో భాగస్వాములు కావాలనుకున్నారు. సరిహద్దులో సైనికులుగా మారి దేశానికి సేవలందించాలని భావించారు. మనస్సు నిండా దేశభక్తిని నింపుకొన్నారు. పట్టుదలతో నిత్యం సాధన చేశారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో సైనిక ఉద్యోగాలకు ఎంపికై లక్ష్యాన్ని చేరుకున్నారు. తల్లిదండ్రుల కలలు నెరవేర్చారు. ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచారు.


