ఆదిలాబాద్: బోథ్ మండలం కౌఠ(బి) గ్రామానికి చెందిన గుండెన స్వామి–స్వప్న దంపతుల చిన్న కుమారుడు రవితేజ తొలి ప్రయత్నంలోనే ఐఏఎఫ్‌లో ఉద్యోగం సాధించాడు. తండ్రి స్వామి ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లగా, తల్లి స్వప్న వ్యవసాయ కూలీగా పని చేస్తోంది. తల్లిదండ్రుల కష్టాలను దూరం చేయాలని భావించిన అతను ఇష్టమైన భారత సైనిక దళంలో చేరాలని నిత్యం శ్రమించాడు. ఇటీవల విడుదలైన ఐఏఎఫ్ అగ్నివీర్ ఫలితాల్లో తొలి ప్రయత్నంలోనే కొలువు సాధించాడు. తన తల్లిదండ్రుల శ్రమ, అన్నయ్య నింపిన స్ఫూర్తి తనను సరిహద్దుల వైపు నడిపించాయని రవితేజ చెబుతున్నాడు.
– గుండెన రవితేజ
గురువు ప్రోత్సాహంతో కొలువు
ఆదిలాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం జామిని గ్రామానికి చెందిన షేక్ ఇబ్రహీం–రెహనా దంపతుల కుమారుడు ఇర్ఫాన్ అగ్నివీర్ జీడీగా ఎంపికయ్యాడు. సైనికుడిగా ఉద్యోగం చేయాలనే ఆలోచనతో శిక్షణ సంస్థలో చేరి గురువు వీజీఎస్ రాకేశ్ వద్ద శిక్షణ పొందాడు. గురువు నిరంతరం ప్రోత్సహించేవారని, ఆయన పర్యవేక్షణలోనే మరింత ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించి ఉద్యోగం సాధించినట్లు వెల్లడించాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం, గురువు మార్గదర్శకత్వలో తాను సైనికుడిగా ఎంపికై నట్లు తెలిపాడు.
– ఎస్కే ఇర్ఫాన్


