రేపు బాబ్లీ గేట్లు ఎత్తివేత
భైంసా: రాష్ట్ర వ్యాప్తంగా ఈయేడు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు అంతగా కురవడం లేదు. ఇప్పుడిప్పుడే అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ)లో నీరు అంతగా లేదు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, గతేడాది జూన్ 30 నాటికి 15.567 టీఎంసీల నీరు ఉండగా, ప్రస్తుతం కూడా 15 టీఎంసీల నీరు ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే ఈసారి కూడా జూలై 1న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకోనున్నాయి. దిగువన ఎస్సారెస్పీలోకి నీళ్లు విడుదల కానున్నాయి. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాబాద్ తాలూకా బాబ్లీ గ్రామం వద్ద 2.74 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు గేట్లు ఏటేటా జూలై 1న ఎత్తి నీటిని వదలాలని సుప్రీంకోర్టు సూచించింది.
త్రిసభ్య కమిటీ..
వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ ప్రాజెక్టుపై కోర్టులకు వెళ్లాయి. అప్పట్లో సుప్రీంకోర్టు ఏటా జూలై 1నుంచి అక్టోబర్ 28 వరకు 14గేట్లు తెరిచి ఉంచాలని ఆదేశించింది. వర్షాకాలంలో నది నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా చూడాలని సూచించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు బాబ్లీ గేట్లు ఎత్తనున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యుల పర్యవేక్షణలో గేట్లు తెరుస్తారు.
ఇక బాబ్లీనీరు..
బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తగానే నీరు ఎస్సారెస్పీలోకి చేరనుంది. గేట్లు ఎత్తి ఉంచడం వల్ల ఎగువన కురిసే వర్షాలకు వరద ఎస్సారెస్సీలోకి వస్తుంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 100, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల చొప్పున ఎస్సారెస్పీ నుంచి నీటిని వదులుతున్నారు.
సరిహద్దుకు 7 కిలోమీటర్ల దూరంలో..
తెలంగాణ రాష్ట్ర సరిహద్దుకు 7 కిలోమీటర్ల దూరంలో బాబ్లీ ప్రాజెక్టు ఉంది. గేట్లు ఎత్తగానే బాబ్లీ ప్రా జెక్టు నీరు నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తికి చేరుతాయి. బాబ్లీ ప్రాజెక్టు నుంచి 18 కిలోమీటర్ల దూ రంలో ఉన్న బాసరకు ఈ నీరు చేరుతుంది. బాసర వద్ద గోదావరి నదిగుండా ఎస్సారెస్పీలోకి వెళ్తుంది. బాబ్లీ ప్రాజెక్టు నుంచి ఎస్సారెస్పీ వరకు సుమారు 70 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడి వరకు నీరు చేరాలంటే కొంతసమయం పడుతుంది.
ఇప్పటికే ఏర్పాట్లు...
ప్రాజెక్టు గేట్లు ఎత్తే విషయమై నీటి పారుదల శాఖ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు కురిస్తే సహజ నీటి ప్రవాహం ఎప్పటిలాగే ఎస్సారెస్పీలోకి చేరనుంది. గోదావరి పరీవాహక ప్రాంతంలో అటు నిజామాబాద్ ఇటునిర్మల్ జిల్లాల్లో తాగు, సాగునీటి పథకాలు ఉన్నాయి. నీరు విడుదలైతే రెండు జిల్లాలఎత్తిపోతలపథకాలకు నీరు అందనుంది.
బాబ్లీ ప్రాజెక్టు(ఫైల్)


