చిత్తం శ్రీరామునిపై భక్తి అదానీ, అంబానీలపై అన్నట్లుగా బీజేపీ వ్యవహరం సీపీఐ జాతీయ నాయకుడు చాడా వెంకట్‌రెడ్డి
పాతమంచిర్యాల: అయోధ్యలోని శ్రీరాముడి గుడికి దేశం నలుమూలల నుంచి భక్తులు ఇచ్చిన విరాళాలు దొంగతనం జరిగితే కాపాడలేని బీజేపీ ప్రభుత్వం దేశాన్నెలా కాపాడుతుందని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. చిత్తం శ్రీరామునిపై భక్తి అదానీ, అంబానీలపై అన్నట్లుగా ఆ పార్టీ వ్యవహారం మారిందని ధ్వజమెత్తారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీపీఐ రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. శ్రీరాముని గుడికి రక్షణ ఇవ్వలేని అసమర్థులు బీజేపీ నాయకులని విమర్శించారు. దేశంలోని సహజ సంపదలు అదానీ, అంబానీలకు అప్పగించడమే లక్ష్యంగా బీజేపీ వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, ఫీజు రీయింబర్స్‌మెంటు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వాసిరెడ్డి సీతారామయ్య, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ఖలిందర్ అలీఖాన్, జిల్లా కార్యవర్గ సభ్యులు ముడుపు ప్రభాకర్‌రెడ్డి, తాండ్ర సదానందం, మేకల దాసు, బొల్లం పూర్ణిమ, జోగుల మల్లయ్య, ఇప్పకాయల లింగయ్య, కే.వీరభద్రయ్య, ముడుపు నళినిరెడ్డి, లింగం రవి, తదితరులు పాల్గొన్నారు.


