నిర్మల్‌టౌన్: నిర్మల్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం నమోదైన అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని సబ్ డివిజనల్ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాస్ సోమవారం వివరాలను వెల్లడించారు. బైంసా పట్టణానికి చెందిన షేక్‌సోహెబ్(19) గతంలో స్నేహితుడైన సారంగాపూర్ మండలానికి చెందిన అనగందుల సాగర్ వద్ద రూ.2 వేలు అప్పుగా తీసుకున్నాడు. వీరిద్దరి మధ్య డబ్బులు, చేతి గడియారం విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో సాగర్ మరో స్నేహితుడైన గుండెన విజయ్‌తో కలిసి ఆదివారం స్థానిక బంగల్‌పేట్ కుంట వద్ద సోహెబ్‌ను కలిశారు. డబ్బుల విషయమై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సోహెబ్‌పై కర్ర, బీరు సీసాతో దాడి చేశారు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని బావిలో పడవేశారు. మృతుడి తల్లి సాకేర బేగం ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, భౌతిక సాక్షాలు, విచారణలో లభించిన వివరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి నేరానికి ఉపయోగించిన కర్ర, బీరు సీసా, మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.


