చదవు చారెడు.. పుస్తకాలు బారెడు! | - | Sakshi
Sakshi News home page

చదవు చారెడు.. పుస్తకాలు బారెడు!

Jun 29 2026 11:49 PM | Updated on Jun 29 2026 11:49 PM

● బాల్యానికి భారంగా ప్రైవేటు చదువులు ● అవసరం లేకున్నా బుక్స్‌ అంటగడుతున్న వైనం ● తల్లిదండ్రులకు ఆర్థిక భారం

భైంసాటౌన్‌: ప్రైవేట్‌ పాఠశాలలు ఐఐటీ, ఒలింపియాడ్‌, ఎక్సలెన్స్‌ వంటి పేర్లు తగిలించుకుని విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నాయి. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వంటి చిన్న తరగతుల పిల్లలకు కూడా అనవసరంగా బండెడు పుస్తకాలు, వర్క్‌బుక్‌లు, డైరీలు అంటగడుతూ బాల్యం వీపుపై భారం మోపుతున్నాయి. అవసరం లేనప్పటికీ రంగురంగుల పుస్తకాలు అందించి, ప్రతి విద్యా సంవత్సరంలో కొత్త కొత్త పబ్లిషర్‌ పుస్తకాలను తల్లిదండ్రులతో కొనిపించడం ద్వారా భారీ దోపిడీకి పాల్పడుతున్నాయి. ఫీజులతోపాటు యూనిఫారాలు, షూస్‌, బెల్టులు, నోట్‌బుక్స్‌ వంటివన్నీ స్కూల్‌లోనే కొనాలనే నిబంధనలు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై మోయలేని ఆర్థిక భారం తెచ్చిపెడుతున్నాయి.

అమలుకాని నిబంధనలు..

బడిపిల్లల బ్యాగుల బరువు తగ్గించేందుకు ప్రభుత్వం గతంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రాథమిక తరగతుల పిల్లల బ్యాగు బరువు 2 నుంచి 3 కిలోలకు మించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ, చాలా ప్రైవేటు పాఠశాలలు వాటిని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా పాఠ్యాంశాలు బోధిస్తుండగా, ప్రైవేట్‌ పాఠశాలలు తల్లిదండ్రులను ఆకర్షించేందుకు అనవసర సబ్జెక్టులు, అదనపు పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌లు అంటగడుతున్నాయి. విద్యాశాఖ నిబంధనల ప్రకారం స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ అమలు చేయాల్సి ఉండగా, చాలా ప్రైవేట్‌ సంస్థలు దీన్ని పాటించడం లేదు. ఫలితంగా బుడిబుడి అడుగులు వేసే చిన్నారులు తమ బరువుకు మించిన బ్యాగులను మోస్తూ ఇబ్బంది పడుతున్నారు. విద్యాశాఖ అధికారులు కేవలం నోటీసులకే పరిమితం కాకుండా, ప్రైవేటు స్కూళ్లపై క్షేత్రస్థాయిలో కఠిన తనిఖీలు చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. అనవసరమైన పుస్తకాల భారాన్ని తగ్గించి, పిల్లలకు స్వేచ్ఛాయుతమైన, ఆనందభరితమైన విద్యా వాతావరణాన్ని అందించాలని వారు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement