
నిండుకుండలా ‘గడ్డెన్నవాగు’
భైంసా: భారీ వర్షాలతో పట్టణ సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీట ర్లు కాగా, ప్రస్తుతం 358.10 మీటర్ల మేర నీటిని నిల్వ చేశారు. ఇన్‌ఫ్లో పెరిగితే గేట్లు తెరిచి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువ కు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం1.83 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.602 టీఎంసీలు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు కింద 13,950 ఎకరాల ఆయకట్టు ఉంది. రెండు రోజులు ప్రాజెక్టులోకి భారీగా వరద రావడంతో గేట్లు ఎత్తి 1.45 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేశారు.
ఉధృతంగా గోదావరి...
బాసర వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరిలో ప్రవాహం పెరిగింది. గోదావరితోపాటు మంజీర నది నుంచి వచ్చే వరద నీరంతా బాసర గుండా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుతోంది.
సిరాలకు వరద..
మరోవైపు భారీ వర్షాలతో సిరాల ప్రాజెక్టులోకి నీరు చేరింది. కాలువ గుండా ప్రాజెక్టు నీరు బయటకు వస్తోంది. ఇటీవలే సిరాల నుంచి ఇలేగాం గ్రామం వరకు కాలువలో పేరుకుపోయిన మట్టిని అధికారులు తొలగించారు. కాలువను బాగుచేయడంతో నీరంతా పొలాలకు వెళ్తోంది.
సిరాలలో అలుగు నుంచి వస్తున్న నీరు