
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
నిర్మల్‌చైన్‌గేట్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. రిజర్వాయర్లకు సంబంధించిన ఇన్‌ఫ్లో అవుట్‌ఫ్లో గురించి ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై నివేదిక తయారు చేయాలని సూచించారు. చెరువులు, కాలువలకు గండ్లు పడితే వెంటనే వాటిని పూడ్చివేయాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పెన్‌గంగ ఉధృతంగా ప్రవహిస్తున్నందున ముంపు ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. వరద నీరు నిలిచి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదమున్నందున పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని, ప్రభావిత మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్, వైద్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. ప్రమాదకరంగా పొంగుతున్న వాగులు, వంకలు దాటకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.