
మరో రెండు రోజులు భారీ వర్షాలు
కడెం: అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి కడెం ప్రాజెక్టు, వంతెనలు, పంట పొలాలను ఆదివారం పరిశీలించారు. ఈ నెల 20, వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున పంటలకు నష్టం జరిగితే సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయిలో నీరు చేరినందున గేట్లు ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. మత్సకారులు, రైతులు, పశువుల కాపరులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలను అప్రమత్తం చేస్తూ, సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. వారివెంట ఎస్పీ జానకీషర్మిల, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా అధికారులు గోవింద్, శ్రీనివాస్, అంజిప్రసాద్, రమణ, డా. రాజేందర్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో అరుణ, ఈఈ విఠల్, ఎంపీవో కవిరాజు తదితరులు ఉన్నారు.