మత్స్యశాఖ ఏడీపై చర్య తీసుకోవాలి
దస్తురాబాద్: మత్స్యశాఖ ఏడీ రాజనర్సయ్యపై చర్య తీసుకోవాలని మండలంలోని భూత్కూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాంపూర్ గ్రామ మత్స్యకారులు గోదావరి తీరంలో మంగళవారం నిరసన తెలిపారు. 2016లో హైకోర్టు తీర్పు ప్రకారం రాంపూర్ మత్స్య సహకార సంఘం ఏర్పాటుకు అనుమతి ఇచ్చారని, ఆ తీర్పు ప్రకారం జిల్లా మత్సశాఖ అధికారులు సంఘం ఏర్పాటు చేసి గోదావరి తీరంలో చేపల వేట సాగించాలని లైసెన్స్‌లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి లైసెన్స్‌లు రెన్యూవల్ చేసుకుంటున్నామని, ఈసారి మాత్రం రెన్యూవల్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్త చేశారు. లైసెన్స్‌లు ఇవ్వకుంటే ఇతర గ్రామాల వారు కూడా వచ్చే అవకాశం ఉందని, దీంతో గొడవలు జరుగుతాయని పేర్కొన్నారు. మత్స్యకారుల మధ్య గొడవ సృష్టించేలా వ్యవహరిస్తున్న ఏడీపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాంపూర్ మత్స్యకారులకు లైసెన్స్‌లు జారీ చేయాలని కోరారు.


