భైంసాటౌన్: పసిడి ధర ౖపైపెకి వెళ్తోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకి చేరుకుంటోంది. గతనెల వరకు నిలకడగా ఉన్న బంగారం ధర ఈనెలలో సరికొత్త గరిష్ట ధరలు నమోదు చేస్తోంది. ఈనెల ప్రారంభంలో పది గ్రాముల ధర రూ.70 వేలు ఉండగా, 12 రోజుల వ్యవధిలో ఏకంగా రూ.6 వేలు పెరిగింది. ఈనెల 6న ఒకే రోజు మూడుసార్లు ధర పెరిగి రూ.73,200లకు చేరుకోగా, శుక్రవారం ఏకంగా నాలుగుసార్లు ధరల్లో హెచ్చుదల నమోదైంది. శుక్రవారం ధరలు పరిశీలిస్తే.. ఉదయం పది గ్రాములకు రూ.74,700 ఉండగా, మధ్యాహ్నం రూ.75,500, సాయంత్రం 3.40 గంటలకు రూ.75,800లకు పెరిగి రూ.76 వేల వద్ద స్థిరపడింది. దీంతో బంగారు, వెండి వర్తకులతోపాటు కొనుగోలుదారులు సైతం పెరుగుతున్న బంగారం ధరలతో ఆందోళన చెందుతున్నారు.