Zika Virus: కలకలం, 17మంది చిన్నారులు, గర్భిణీకి వైరస్‌

Zika Outbreak In Kanpur 17 Children Among 89 Infected - Sakshi

సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌ జికా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలోని కొన్ని చోట్ల జికా వైరస్ విజృంభిస్తుండగా, గత వారం రోజులుగా కాన్పూర్‌లో పెరుగుతున్న జికా వైరస్  కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. దోమల ద్వారా సంక్రమించే  ఈ కేసుల సంఖ్య సోమవారంనాటికి  89కి చేరింది. బాధితుల్లో ఒక గర్భిణీ, 17 మంది పిల్లలు ఉండటం మరింతగా ఆందోళన కలిగిస్తోంది. 

మొదటి జికా కేసు అక్టోబర్ 23న గుర్తించగా, గత వారంలో కేసుల సంఖ్య పెరిగింది. సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడెస్ ఈజిప్టి దోమల ద్వారా జికా వ్యాపిస్తుంది. నిలకడగా ఉన్న నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. డెంగ్యూ, చికున్‌ గున్యా వ్యాప్తికి కారకాలు కూడా. జికా వైరస్ సోకితే జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్లు చర్మం ఎర్ర బారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కొందరిలో మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. 

కాగా  జికా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతోంద‌ని, అనేక వైద్య బృందాలు వ్యాధిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కాన్పూర్ జిల్లా మెడిక‌ల్ చీఫ్ ఆఫీస‌ర్ డాక్టర్‌ నేపాల్ సింగ్ తెలిపారు. కాంటాక్ట్ ట్రేసింగ్‌తోపాటు, వైరస్‌ను వ్యాప్తి చేసే దోమ సంతానోత్పత్తి జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top