జికా వైరస్‌: హై అలర్ట్‌ ప్రకటించిన కేరళ ప్రభుత్వం

Zika Outbreak: High Alert In Kerala - Sakshi

సాక్షి, తిరువనంతపురం: కరోనా మహమ్మారితో వణికిపోతున్న తరుణంలో కేరళలో జికా వైరస్‌ కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం జికా వైరస్‌పై హై అలెర్ట్‌ ప్రకటించింది. జికా వైరస్‌ బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అదేవిధంగా కేరళ పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కూడా జికా వైరస్‌ వ్యాప్తి విషయంలో అప్రమత్తమైంది.

చామరాజనగర్‌, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కేరళలో మొదట ఓ 24 ఏళ్ల గర్భిణిలో జికా వైరస్‌ లక్షణాలను గుర్తించారు. ఆమెతోపాటు మరికొందరి శాంపిళ్లను పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. ఆమె సహా 14 మందికి జికా ఇన్ఫెక్షన్‌ ఉన్నట్టుగా తేలింది. జికా ఇన్ఫెక్షన్‌ మరీ ప్రమాదకరమేమీ కాదని.. కానీ కొన్నేళ్లుగా మ్యుటేట్‌ అయి కొత్త వేరియంట్లు వస్తుండటంతో జాగ్రత్త తప్పనిసరని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం శుక్రవారం ఎయిమ్స్‌కు చెందిన ఆరుగురు నిపుణుల బృందాన్ని కేరళ రాష్ట్రానికి పంపించిన విషయం తెలిసిందే. ఈ బృందం కేరళలో పరిస్థితులను సమీక్షించడంతోపాటు, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందజేస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ ప్రకటించారు. మరోవైపు కేరళ ప్రభుత్వం జికా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది. కేసులను గుర్తించిన తిరువనంతపురం జిల్లాల్లో విస్తృతంగా వైద్య పరీక్షలు చేపట్టింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top