విద్యార్థి నేత నుంచి సీఎం పీఠం వరకు

From Youth Leader to Assam Chief Minister - Sakshi

హిమంత బిశ్వ శర్మ రాజకీయ ప్రస్థానం

కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల్లో కీలకపాత్ర

ఈశాన్యంలో బీజేపీకి కీలక వ్యూహకర్త

గువాహటి: అస్సాం రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ రాజకీయ ప్రస్థానం ఆల్‌ అస్సాం స్టూడెంట్‌ యూనియన్‌(ఏఏఎస్‌యూ)లో విద్యార్థి నేతగా ప్రారంభమైంది. 1991–92లో రాజనీతి శాస్త్రంలో పీజీ చేస్తున్న సమయంలో ప్రఖ్యాత కాటన్‌ కాలేజ్‌ యూనియన్‌ సొసైటీకి జనరల్‌ సెక్రటరీగా శర్మ పనిచేశారు.

ఏఏఎస్‌యూలో పనిచేస్తున్న సమయంలో రాష్ట్రంలో కీలక నేతలైన ప్రఫుల్ల కుమార్‌ మహంత, భ్రిగు కుమార్‌ ఫుకాన్‌లకు దగ్గరయ్యారు. 90లలో నాటి ముఖ్యమంత్రి హితేశ్వర్‌సైకియా శర్మను కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చారు. ఆయన అండతో శర్మ రాజకీయంగా ఎంతో ఎదిగారు. అనంతరం, జలుక్బరి అసెంబ్లీ స్థానం నుంచి తన రాజకీయ గురువు భ్రిగు ఫుకాన్‌ పైనే గెలుపొం దారు. ఇదే నియోజకవర్గం నుంచి 2006, 2011, 2016ల్లో కూడా ఆయన గెలుపొందారు. తాజా ఎన్నికల్లో లక్షకు పైగా మెజారిటీ సాధించారు.  

తరుణ్‌ గొగోయ్‌తో విభేదించి
కాంగ్రెస్‌లో ఉండగా నాటి సీఎం తరుణ్‌ గొగోయ్‌కి అత్యంత విశ్వసనీయ సహచరుడిగా వ్యవహరించారు. ఆయన మంత్రివర్గంలో పలు కీలక పోర్ట్‌ఫోలియోలను సమర్ధవంతంగా నిర్వహించారు. 2011లో ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని కాంగ్రెస్‌ వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి హిమంత రాజకీయ వ్యూహాలే కారణం. కానీ 2013లో తరుణ్‌ గొగోయి తన కుమారుడు గౌరవ్‌ గొగోయ్‌కి తన వారసుడిగా ప్రాముఖ్యత ఇస్తున్న నేపథ్యంలో తరుణ్‌ గొగోయ్‌తో హిమంత బిశ్వ శర్మకు విబేధాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్‌లో ఉంటే సీఎం కావాలన్న తన లక్ష్యం నెరవేరదన్న అభిప్రాయంతో.. ఆ తరువాత రెండేళ్లకు మరో 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి శర్మ బీజేపీలో చేరారు.

అంతకుముందు, అస్సాంలో అధికార సంక్షోభంపై చర్చించేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీని కలిశారు. ఆ తరువాత ఆ సమావేశం గురించి శర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ‘అస్సాంలో రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడం కన్నా.. ఆయన తన కుక్కలకు బిస్కెట్లు వేయడంపైననే ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు’ అని ఆ భేటీ అనంతరం శర్మ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ఉండగా ఆయనపై శారద చిట్‌ ఫండ్స్, లూయిస్‌ బెర్జర్‌ కుంభకోణాల్లో పాత్ర ఉన్నట్లుగా ఆరోపణలొచ్చాయి. బీజేపీ ప్రభుత్వంలో ఆర్థికం, ఆరోగ్యం, విద్య తదితర కీలక శాఖలను నిర్వహించారు. నార్త్‌ ఈస్ట్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ కన్వీనర్‌గా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి కృషి చేశారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో, 2017లో మణిపూర్‌లో కూటమి ఏర్పాటులో, మేఘాలయలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. నాగాలాండ్‌లో హెచ్‌బీఎస్‌గా చిరపరిచితుడైన శర్మ.. బీజేపీ, నాగా పీపుల్స్‌ ఫ్రంట్, నేషనల్‌ డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. గత సోనోవాల్‌ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ కూడా నిర్వహించిన శర్మ.. కరోనా సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో వైద్య రంగంలో మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేశారు. ప్రస్తుతం మొత్తం ఈశాన్య ప్రాంతంలోనే అత్యంత శక్తిమంతమైన నేతగా, బీజేపీలో ట్రబుల్‌ షూటర్‌గా ఎదిగారు. శర్మ 2001 నుంచి అన్ని ప్రభుత్వాల్లో మంత్రిగా ఉండడం విశేషం. ఈశాన్యంలో బలోపేతం కావాడానికి శర్మ వంటి నేత అవసరమని గుర్తించిన బీజేపీ ఆయనను విజయవంతంగా తమ పార్టీలోకి తీసుకువచ్చింది. బీజేపీలోకి వస్తూనే వరుసగా మూడు పర్యాయాలు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌ను గద్దె దించడంలో హిమంత కీలకపాత్ర పోషించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top