
ఇంతవరకు ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ ఆర్థిక రంగం, ఎంటర్‌టైన్‌మెంట్, రవాణ, ఆరోగ్య సంరక్షణ వరకు అన్నింటిలోకి వచ్చేసి తన సత్తా ఏంటో చూపించింది. దాంతో అస్సలు ఇక మ్యాన్‌పవర్‌తో పనిలేదు, అస్సలు ఉద్యోగాలు కూడా ఉండవేమో అనే గుబులు అందరిలోనూ పెంచేసింది. అలాంటి తరుణంలో మరో బాంబు పేల్చింది ఏఐ. రాజకీయాల్లో కూడా తన ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యి..పాలకులకు పనిలేకుండా చేస్తుందో లేక పాలకులే అవసరం లేకుండా అంతా సాంకేతికత మయం అవుతుందో తెలియాల్సి ఉంది. ఇదంతా ఎందుకంటేఓ దేశంలో ఏఐ.. ఏకంగా మంత్రిగా పాలన సాగిస్తోంది. అంతేగాదు రాజకీయాల్లో మహామహులునే తలదన్నేలా చక్రం తిప్పబోతోంది. ఔను ఇదంతా నిజం. ఇంతకీ ఇదంతా ఎక్కడంటే..
అల్బేనియా దేశం ఆ చొరవను తీసుకుని సరికొత్త అధ్యయనానికి తెరతీసింది. పైగా అవినీతిని నిర్మూలించడం కోసం పాలిటిక్స్‌లోని ఏఐ సాంకేతికతను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఆ నేపథ్యంలోనే ఏఐ డియెల్లా అనే మహిళా కేబబినేట్ మంత్రినే నియమించి అందర్ని విస్తుపోయాలా చేసింది అల్బేనియా ప్రభుత్వం. అంతేగాదు ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ కేబినేట్ మంత్రిని నియమించుకున్న దేశంగా అల్బేనియా వార్తల్లో నిలిచి, హాట్‌టాపిక్‌గా మారింది.
అల్బేనియాలో ఈ ఏఐ మంత్రి పాత్ర..
ఒకానొక సమ్మర్‌లో ప్రధాన మంత్రి ఏడీ రామ మాట్లాడుతూ..ఏదో ఒక రోజు ఏఐ డిజిటల్ మంత్రి, ప్రధాన మంత్రి కూడా రావొచ్చేమో అని కామెడీగా అన్నారు. ఇలా అన్నారో లేదో ఊహకందని విధంగా ఆ రోజు రానే వచ్చేయడం విశేషం. ఇటీవలి జరిగిన సోషలిస్ట్ పార్టీ సమావేశంలో ఏయే మంత్రులు తదుపరి పదవికి కొనసాగుతారో, ఎవరో వెళ్లిపోతారో ప్రధాని రామ ప్రకటించారు. ఆ సమయంలోనే మానవేతర సభ్యురాలు డీయోల్లా అనే మహిళా ఏఐని కూడా ఆయన నేతలకు పరిచయం చేశారు.
ఆమె భౌతికంగా హాజరు కానప్పటికీ ఈ సమావేశంలో తొలి సభ్యురాలు ఆమెనే. కృత్రిమ మేధస్సుతో (ఏఐ) సృష్టించబడిన ఏఐ మంత్రి అని పార్టీ సభ్యులకు తెలిపారు. అంతేగాదు ఇది సైన్స్ ఫిక్షన్ కాదని, డీయెల్లా విధి అని నాయకులకు చెప్పారు. తమ దేశంలోని అవినీతి నిర్మూలనే ధ్యేంగా ఈ ఏఐ మంత్రిని తీసుకొచ్చినట్లుగా వెల్లడించారు కూడా. ఇక ఈ ఏఐకి టెండర్లపై నిర్ణయాలు తీసుకునే బాధ్యత అప్పగించినట్లు కూడా తెలిపారు. అదంతా దశల వారీగా జరుగుతుందని, పైగా నూటికి నూరు శాతం అవినీతికి తావివ్వకుండా జరుగుతుందని చెప్పుకొచ్చారు.
సింపుల్‌గా చెప్పాలంటే అల్బేనియా ప్రభత్వం చేసిన నిజమైన రాజకీయ చర్యగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. ఇక ఈ ఏఐ మంత్రి గారు వాయిస్ కమాండ్‌ల ద్వారా బ్యూరోక్రాటిక్ అభ్యర్థనలను ప్రాసెస్ చేస్తూనే ఉన్నా.. ఇప్పటికే దేశ డిజిటల్ సేవల పోర్టల్ ద్వారా పౌరులకు సేవలు కూడా అందిస్తున్నట్లు సమాచారం.
కాగా, ప్రధాని రామా ప్రకారం..ఈ వ్యవస్థ లంచాలు, బెదిరింపులు అరికట్టడంలో సహాయపడుతుందనేది సారాంశం. దీనిని నిజంగా పాలన పరిణామంలో ఒక గొప్ప మైలురాయిగా పేర్కొనవచ్చు. ఈ డెవలప్‌మెంట్ అల్బేనియా దేశాన్ని ప్రత్యేకమైనది నిలిచేలా చేసినప్పటికీ..ఈ ఘటన మాత్రం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.
(చదవండి: పెంపకంలో విఫలమయ్యారంటూ..ఆ తల్లిదండ్రులకు రూ. 2 కోట్లు జరిమానా..!)