పేరెంటింగ్‌ విషయంలో బీకేర్‌ఫుల్‌..! ఆ తల్లిదండ్రులకు రూ. 2 కోట్లు జరిమానా.. | Shanghai Teens Urinate in Hotpot Soup, Parents Fined ₹2 Crore by Court | Sakshi
Sakshi News home page

పెంపకంలో విఫలమయ్యారంటూ..ఆ తల్లిదండ్రులకు రూ. 2 కోట్లు జరిమానా..!

Sep 17 2025 2:08 PM | Updated on Sep 17 2025 3:00 PM

Chinese Court Orders Parents To Pay  More Than Rs 2 Crore Goes Viral

పిల్లలు ప్రవర్తనా తీరు వల్లే వాళ్ల తల్లిందండ్రులకు గుర్తింపు లేదా అవమానం అనేవి రావడం జరుగుతాయి. అందుకే పిల్లల పెంపకంలో ప్రతి తల్లిదండ్రులు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని అంటుంటారు. వాళ్లు గనుక ఇతరులను ఇబ్బందిపెట్టేలా ఊహకందని ఘనకార్యం చేసి వస్తే..ఇక తల్లిదండ్రులకు చీవాట్లు, అవమానాలు తప్పవు. అంతవరకు అయితే పర్లేదు, వారి కారణంగా కోర్టులపాలై, కోట్ల కొద్ది జరిమానాలు ఎదుర్కొంటే ఆ తల్లిదండ్రులకు కనడమే నేరంగా మారుతుంది. అలాంటి దురదృష్టకర ఘటనే పాపం ఆ ఇద్దరు టీనేజర్ల తల్లిందండ్రులకు ఎదురైంది.

అసలేం జరిగిందంటే..ఆ యువకులను చూస్తే..అబ్బా ఇలాంటి పుత్రులు పగవాడికి కూడా వద్దు అని అస్యహించుకునేంత దారుణానికి ఒడిగట్టారు ఆ ఇద్దరు. వాళ్లు చేసిన పని వింటే ఎవ్వరికైనా చిర్రెత్తికొచ్చి తిట్టిపోసేలా ఉంది. ఈ ఘటన చైనాలోని షాంఘైలో చోటు చేసుకుంది. అక్కడ ప్రసిద్ద హైడిలావ్‌ హాట్‌పాట్‌ రెస్టారెంట్‌లో టాంగ్‌ అనే ఇంటిపేరుతో ఉన్న ఇద్దరు 17 ఏళ్ల యువకులు మద్యం తాగి ఆ మత్తులో విచక్షణరహితంగా ప్రవర్తించారు. 

సమీపంలోని టైబుల్‌ ఎక్కి సంప్రాదాయ చైనీస్‌ హాట్‌పాట్‌ శైలిలో మాంసం, కూరగాయలు వండటానికి ఉపయోగించే కమ్యూనల్‌ సూప్‌లో మూత్రం పోశారు. ఆ ఇరువురు ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటన ఫిబ్రవరి 24, 2025న ఒక ప్రైవేట్ డైనింగ్ రూమ్‌లో జరిగింది. అయితే ఆ కలుషితమైన రసాన్ని కస్టమర్లు సేవించినట్లు ఆధారాలు లేవు. 

అందుకుగానూ సదరు బ్రాంచ్‌ హైడిలావ్‌ రెస్టారెంట్‌ ఈ సంఘటన జరిగిన రోజు నుంచి మార్చి 8లోపు సందర్శించిన దాదాపు నాలుగువేల మంది కస్టమర్లకు పరిహారం చెల్లించింది. అంతేగాదు ఈ ఘటనకు పరిహారం కావాలంటూ సదరు రెస్టారెంట్‌ కోర్టు మెట్లు ఎక్కింది. ఈ ఘటన కారణంగా తమ రెస్టారెంట్‌ పరవు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది, పైగా కస్లమర్ల నమ్మకానికి భంగం కలిగేలా చోటు చేసుకుందని అందుకుగానూ తమకు సుమారు రూ. 28 కోట్లు దాక నష్ట పరిహారం చెల్లించాలని కోరింది. 

ఈ కేసుని విచారించిన షాంఘై కోర్టు..ఇది అవమానకరమైన చర్యగా పేర్కొంటూ..టేబుల్‌వేర్‌ని కలుషితం చేయడమే గాక ప్రజలకు కూడా అసౌకర్యం కల్పించారంటూ మండిపడింది. ఈ టీనేజర్లు ఇద్దరు సదరు రెస్టారెంట్‌ ఆస్తిహక్కులు, ప్రతిష్టను ఉల్లంఘించారని పేర్కొంది. అంతేగాదు ఈ టీనేజర్ల తల్లిదండ్రులు పిల్లల సంరక్షణ బాధ్యతల్లో విఫలమయ్యారంటూ చీవాట్లు పెట్టింది. అందుకుగానూ ఆ పేరెంట్స్‌ని సందరు రెస్టారెంట్‌కి రూ. 2 కోట్లుదాక నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా తీర్పు వెలువరిచ్చింది. 

అలాగే ఆ టీనేజర్ల తల్లిదండ్రులు సదరు రెస్టారెంట్‌కి బహిరంగంగా క్షమాపణుల కోరుతూ.. వార్తపత్రికలో ప్రచురించాలని కూడా ఆదేశించింది. అందుకేనేమో మొక్కై వంగనిది.. మానై వంగునా అని పెద్దలు అంటుంటారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే సరిగా పెరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. లేదంటే వాళ్లు చేసే ఘనకార్యలకు ఫలితం అనుభవించక తప్పదు. పేరెంటింగ్‌ విషయంలో ప్రతి తలిందండ్రులు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని ఈ ఉదంతం చెప్పకనే చెబుతోంది కదూ..!.

(చదవండి: రండి.. ఫొటో దిగుదాం’)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement