మోదీ కార్యక్రమానికి యడ్డి డుమ్మా

Yediyurappa not invited to PM Modi event in Karnataka Tour - Sakshi

అధికారిక కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి గైర్హాజరు 

కర్ణాటక రాజకీయాల్లో చర్చ 

బీజేపీ, సీఎం బొమ్మైపై అసంతృప్తే కారణం!   

సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లి (హుబ్లీ) నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న అధికారిక కార్యక్రమానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప గైర్హాజరయ్యారు. ఆయన గైర్హాజరు ప్రస్తుతం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గురువారం హుబ్లీ రైల్వే మైదానంలో జాతీయ యువ జనోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. పలువురు బీజేపీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నప్పటికీ బీఎస్‌ యడియూరప్ప మాత్రం కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన కొన్ని నెలలుగా పార్టీ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది.

బీజేపీ తనను నిర్లక్ష్యం చేస్తోందని, ప్రజల్లో వ్యక్తిగతంగా బలమున్న తనను రాజకీయంగా ఎవరూ అంతం చేయలేరని పలు సందర్భాల్లో అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తన రాజకీయ జీవితానికి ఎవరూ ఫుల్‌స్టాప్‌ పెట్టలేరని యడియూరప్ప ఒకసారి బహిరంగంగా వ్యాఖ్యానించారు. మరోవైపు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, యూడియూరప్ప మధ్య విభేదాలు ముదురుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి అర్ధాంతరంగా తప్పించారని యడియూరప్ప రగిలిపోతున్నారు. తన అనుచరుడైన బొమ్మైని సీఎం కుర్చీలో కూర్బోబెట్టడం జీర్ణించుకోలేకపోతున్నారు.  

ప్రభుత్వంలో పదవి లేకపోవడం వల్లే..  
యడియూరప్ప అసంతృప్తిని గుర్తించిన బీజేపీ అధిష్టానం గత ఏడాది పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా నియమించింది. అయితే, రాష్ట్ర బీజేపీలో ఆశించిన గౌరవం దక్కకపోవడంతో జనసంకల్ప యాత్రలో ఆయన పాల్గొనలేదు. పార్టీ పెద్దలు దిగివచ్చి బుజ్జగించాల్సి వచ్చింది. ఇటీవలే మాండ్య జిల్లాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పర్యటనకు యడియూరప్ప డుమ్మా కొట్టారు. తాజాగా ప్రధాని మోదీ హుబ్లీ పర్యటనకు సైతం దూరంగా ఉండిపోయారు. రాష్ట్ర బీజేపీ వాదన మరోలా ఉంది. జాతీయ యువజనోత్సవానికి మాజీ సీఎంకు ఆహ్వానం అందించలేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కావడంతో ఆహ్వానించలేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వంలో యడియూరప్పకు ప్రస్తుతం ఎలాంటి పదవి లేదని, అందుకే ఆహ్వానం పంపలేదని కర్ణాటక బీజేపీ వెల్లడించింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top