రక్తదానంతో.. చిరంజీవులు..

World Blood Donor Day Celebrations Amid Corona Crisis - Sakshi

జూన్‌ 14న ప్రపంచ రక్త దాతల దినోత్సవం

2005లో ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సం‍స్థ

రక్తదానం చేయండి... ప్రపంచాన్ని పరిగెత్తించండి 

పూర్వ వరంగల్‌ జిల్లాలో తలసేమియా బాధితులు ఎక్కువ. పదిహేను రోజులకు ఓసారి రక్త మార్పిడి చేయకుంటే వాళ్ల ప్రాణాలకే ప్రమాదం. ఈ జిల్లాలో ఉన్న తలసేమియా, సికెట్‌ రోగులకు వరంగల్‌లో ఉన్న ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సోసైటీ ఆధ్వర్యంలోని రక్తనిధి ప్రధాన జీవనాధారం. ఇక్కడ ఎల్లవేళలా 300 నుంచి 400 యూనిట్ల రక్తం ఎప్పుడూ అందుబాటులో ఉండేది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత ఇక్కడ రక్తం నిల్వలు తగ్గిపోయాయి. తలసేమియా రోగులు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఇది ఒక్క వరంగల్‌లోనే కాదు దాదాపు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. 

వెబ్‌డెస్క్‌: కరోనా సెకండ్‌ వేవ్‌  ఎఫెక్ట్‌తో దేశ వ్యాప్తంగా బ్లడ్‌ సెంటర్లలో రక్తపు యూనిట్ల నిల్వలు  అడుగంటి పోయాయి. కరోనా విజృంభనతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో రక్త సేకరణ నెమ్మదించింది. మరోవైపు కరోనా రోగుల చికిత్సలో భాగంగా గత ఏడాది కాలంగా ప్లాస్మా దానంపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఫలితంగా బ్లడ్‌ సెంటర్లలో రక్తనిధి తగ్గిపోతోంది.  రోడ్డు ప్రమాదాలు, ఆపరేషన్లు, డయాలసిస్‌ వంటి సమయాల్లో మనుషుల ప్రాణాలు కాపాడటంలో  బ్లడ్‌ సెంటర్లు కీలకం. ఎంతో మంది తమ స్వచ్ఛంధంగా రక్తాన్ని దానం చేసి ఈ బ్లడ్‌ సెంటర్లకు ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. అలాంటి ప్రాణదాతల్లో స్ఫూర్తి నింపేందుకు ప్రతీ ఏడు జూన్‌ 14వ తేదిన అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుతున్నారు.

జూన్‌ 14న
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 2005 మేలో అంతర్జాతీయ రక్త దాతల దినోత్సవం జరపాలని నిర్ణయించింది. రక్తాన్ని ఏ, బీ, ఏబీ, ఓ పాజిటివ్‌ , నెగటివ్‌ గ్రూపులను గుర్తించిన కార్ల్‌ లాండ్‌ స్టీవర్‌ జన్మదినమైన జూన్‌ 14ను  వరల్డ్‌ బ్లడ్‌ డోనర్‌ డేకి డబ్ల్యూహెచ్‌వో ఎంపిక చేసింది. రక్తదానం చేయండి ... ప్రపంచం పరిగెత్తేలా చేయండి అనే నినాదంతో ఈ ఏడాది వరల్డ్‌ బ్లడ్‌ డోనర్‌ డేను నిర్వహించాలని నిర్ణయించారు. 

వేలకట్టలేని సాయం
సైన్సు ఇప్పటికే ఎన్నో విషయాలను కనిపెట్టింది. మరెన్నో కనిపెడుతోంది కూడా. శాస్త్ర, సాంకేతిక రంగం ఎంతగా అభివృద్ధి చెందినా దానికి పరిమితులు ఉన్నాయి. ఇప్పటికీ   కృత్రిమంగా రక్తాన్ని తయారు చేయగల సైన్సు అభివృద్ధి చెందలేదు. రక్త దానం ఒక్కటే ఇకప్పటికీ మార్గం. రక్తదాతలు తమ దయ గుణంతో  ప్రతీ రోజు ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ వారు చిరంజీవులుగా ఉండేలా సహాయ పడుతున్నారు.

బ్లడ్‌ సెంటర్లు
ప్రపంచమంతటగా ప్రభుత్వ, ప్రైవేటు సం‍స్థల ఆధ్వర్యంలో బ్లడ్‌ సెంటర్లు ఉన్నాయి.  రెడ్‌క్రాస్, రెడ్ క్రీసెంట్ సొసైటీల వంటి అంతర్జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థలు రక్తసేకరణ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. తెలుగు స్టేట్స్‌లో మెగాస్టార్‌ చిరంజీవి బ్లడ్‌ సెంటర్‌ను నెలకొల్పారు. రెండు దశబ్ధాలుగా ఆయన అభిమానులు ఎంతో మంది రక్తదానం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన అనేక సంస్థలకు చెందిన ఉద్యోగులు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి రక్తాన్ని దానం చేస్తున్నారు.

రక్తదానం ఎవరు చేయోచ్చు
- ఆరోగ్యంగా ఉండి 18 నుంచి 60 సంవత్సరాల్లోపు ఉన్న వారు రక్తదానం చేయవచ్చు. 
- రక్తదానం చేయాలంటూ శరీర బరువు 50 కేజీలకు పైన ఉండాలి
- ఆరోగ్యంగా ఉన్న ఓ వ్యక్తి  450 మిల్లీ లీటర్ల వరకు రక్తం దానం చేయవచ్చు.
- పురుషులు ప్రతి మూడునెలలకోసారి మహిళలు ప్రతి నాలుగు నెలలకోసారి రక్తదానం చేయవచ్చు. 

ప్రయోజనాలు
- బాడీలోని ఐరన్‌ని బ్యాలెన్స్‌ చేస్తుంది
- గుండెపోటు, కేన్సర్ వంటి ప్రాణాంత వ్యాధులకు  దూరంగా ఉంచుతుంది
- తరచూ రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొవ్వుశాతం తగ్గుతుంది. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది.
- ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి రెట్టింపు అవుతుంది. 
- ఊబకాయం ఉన్నవారు సాధారణ స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంది. తరచుగా రక్తదానం చేయడం వల్ల శరీరంలోని అదనపు కేలరీలను బర్న్ అవుతాయి. 

చదవండి: ఒబెసిటీ.. అధిక బరువే కాదు అంతకు మించి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top