
న్యూఢిల్లీ: భర్తను తన బంధువు(బావ) సాయంతో అత్యంత పాశవికంగా హత్యచేసిన మహిళను, ఆమె ప్రియుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఢిల్లీలోని అలీపూర్ నివాసి సోనియా (34), సోనిపట్‌కు చెందిన రోహిత్(28)గా గుర్తించామని, ఈ కేసులో మరో కీలక నిందితుడు విజయ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) హర్ష్ ఇండోరా మీడియాకు తెలిపారు.
మృతుడు ప్రీతమ్ ప్రకాష్ (42) అలీపూర్‌కు చెందిన చరిత్రకారుడు. 2024, జూలై 5న ప్రీతమ్ ప్రకాష్ సోనిపట్‌లోని గన్నౌర్‌లో సోదరి ఇంటిలో ఉంటున్న సోనియాను తీసుకెళ్లడానికి వచ్చాడు. అయితే ఏదో విషయమై వారి మధ్య గొడవ జరిగింది. దీంతో ప్రీతమ్ ప్రకాష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భర్తపై ఆగ్రహంతో ఉన్న సోనియా తన బంధువు(బావ) విజయ్‌కి రూ. 50 వేలు ఇచ్చి, భర్తను హత్యచేయాలని కోరింది. ఇంతలో ప్రీతమ్ ప్రకాష్ తిరిగి వచ్చి, సోనియాను ఇంటికి రమ్మని వేడుకున్నాడు. ఆ రోజు రాత్రి ప్రీతమ్ ప్రకాష్ టెర్రస్‌పై పడుకున్నాడు. ఇదే సమయంలో విజయ్ అతనిని హత్య చేశాడు. తరువాత ఆ మృతదేహాన్ని ఒక పథకం ప్రకారం అగ్వాన్‌పూర్ సమీపంలోని కాలువలో పడేశాడు.
జూలై 20న, సోనియా తన భర్త అదృశ్యమైనట్లు ఆలీపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఏడాది తర్వాత ప్రీతమ్ ప్రకాష్ ఉపయోగించిన ఫోన్ యాక్టివ్ మోడ్‌లోకి రావడాన్ని పోలీసులు గుర్తించారు. సోనిపట్‌లోని రోహిత్ ఆ ఫోన్‌ను ఉపయోగిస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు అతనిని ప్రశ్నించగా, అతను తొలుత దర్యాప్తు అధికారులను తప్పుదారి పట్టించాడు. అయితే ఆ తరువాత నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అలాగే తనకు సోనియాతో సంబంధం ఉన్నదని, సోనియా, విజయ్‌లు ప్రీతమ్‌ను చంపడానికి కుట్ర పన్నారని రోహిత్ పోలీసులకు తెలిపాడు. భర్తను హత్యచేసేందుకు సోనియా.. విజయ్‌కు డబ్బులు ఇచ్చిందన్నాడు.
ప్రీతమ్ ప్రకాష్ హత్య తరువాత సోనియా అతని ఫోన్‌ను రోహిత్‌కు ఇచ్చిందని పోలీసులు తెలిపారు. కాగా సోనియాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె ప్రీతమ్‌ను ప్రేమించి, కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుంది. అనంతరం వారికి ముగ్గురు పిల్లలు కలిగారు. అయితే ఇదే సమయంలో సోనియా, రోహిత్‌లు వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. కాగా రోహిత్‌పై గతంలో హత్య, ఆయుధాలు కలిగి ఉండటం తదితర నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రీతమ్ ప్రకాష్‌ను హత్యచేసిన విజయ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని,అతని కోసం గాలిస్తున్నామని డీసీపీ ఇండోరా తెలిపారు.