
మొరాదాబాద్: అమ్మా, నాన్న.. నన్ను క్షమించండి. నేను ప్రేమ వివాహం చేసుకుని తప్పు చేశాను. నా భర్త నన్ను అర్థం చేసుకోవడం లేదు. నా ఆడపడుచు, మామ వేధింపులు భరించలేకపోతున్నా. ఈ జన్మకు మిమ్మల్ని ఆనందంగా చూసుకోలేకపోయాను. మళ్లీ జన్మంటూ ఉంటే మీకు బిడ్డగా జన్మిస్తాను అంటూ వీడియో రికార్డు చేసి నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. మొరాదాబాద్‌కు చెందిన అమ్రీన్ జహాన్(23) నాలుగు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకుంది. తన భర్త బెంగళూరులో ఉద్యోగం చేస్తుండటంతో అతడు అక్కడికి వెళ్లాడు. అమ్రీన్ అత్తారింట్లోనే ఉంది. ఈ క్రమంలో ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా అత్తంట్లో ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. ఇంట్లో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సాకుతో ఆమెను వేధించడంతో బాధను తట్టుకోలేకపోయింది. దీంతో, ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు భర్త, ఆడపడుచు, మామనే కారణమని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన ఆవేదనను వీడియోలో రికార్డు చేసింది.
వీడియోలో ఆమె మాట్లాడుతూ.. నా భర్త కొన్నిసార్లు నా ఆహారపు ఆటవాట్ల గురించి సెటైర్లు వేస్తారు. నా ఆడపడుచు ఖతిజా ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటుంది. ఏ పని చేసినా వారికి నచ్చదు. కొన్నిసార్లు వారు నా గదికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. నా మామ షాజిద్ నాతో అనుచితంగా ప్రవరిస్తాడు. నా ఆరోగ్యం బాగా లేనప్పుడు కూడా నా బాధను అర్థం చేసుకోలేదు. వారి వేధింపుల గురించి నా భర్తకు చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోవడం లేదు. పైగా నన్నే తిడుతున్నాడు. నువ్వు ఎందుకు చచ్చిపోవడం లేదని అంటున్నాడు. నా ఆడపడుచు, మామ కూడా ఇలాగే అంటున్నారు. చచ్చిపో.. చచ్చిపో అని అంటున్నారు. వీరి వేధింపులను నేను సహించలేకపోతున్నాను. నేను చనిపోయేటప్పుడు ఎంత బాధ ఉంటుందో తెలియదు.. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా బాధపడుతున్నాను. నా చావుకు నా భర్త, ఆడపడుచు, మామనే కారణం’ అని చెప్పుకొచ్చింది. అనంతరం, ఆత్మహత్య చేసుకుంది.
తన బిడ్డ చావు అమ్రీన్ తల్లిదండ్రులకు తెలియడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. అనంతరం, ఆమె తండ్రి సలీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్రీన్ నిన్న తనకు ఫోన్ చేసి ఏడ్చాడని అతను చెప్పాడు. తనపై దాడి జరుగుతోందని, తనను కాపాడమని వేడుకున్నట్టు తెలిపాడు. ఇంటి వచ్చేలోపే బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై సలీం.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సలీం ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అమ్రీన్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.