రాహుల్‌ అంగీకరించకపోతే...బయటవారికే పగ్గాలు ఇస్తే?

Will he, will he not: Congress Rahul Gandhi dilemma - Sakshi

కాంగ్రెస్‌ రథసారథిపై పార్టీలో విస్తృతంగా చర్చ 

రాహుల్‌ అంగీకరించకపోతే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు 

సోనియా అనారోగ్యం, మన్మోహన్‌ లాంటి విశ్వసనీయుడు లేకపోవడం అసలైన సవాళ్లు 

ఎన్నికలకు సిద్ధమన్న సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ

ఆగస్టు 21–సెప్టెంబర్‌ 20 మధ్య ఎన్నికలు నిర్వహిస్తామని గతంలోనే కాంగ్రెస్‌ ప్రకటన

రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారా? లేదా? ఇప్పుడు కాంగ్రెస్‌లో దీనిపైనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ఆ పార్టీ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ సంసిద్ధంగా ఉన్నట్టు ప్రకటించడంతో అందరి దృష్టి రాహుల్‌ తదుపరి అడుగులపై పడింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకీ క్షీణిస్తూ ఉండడంతో పార్టీని ముందుకు నడిపించే నాథుడెవరన్న ఆందోళన మొదలైంది. రాహుల్‌ గాంధీ పగ్గాలు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తారో లేదో ఆయనకు అత్యంత  సన్నిహితంగా మెలిగే నాయకులు కూడా చెప్పలేకపోతున్నారు.

ఈ ఏడాది ఆగస్టు 21 సెప్టెంబర్‌ 20 మధ్య అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని గత ఏడాది అక్టోబర్‌లో కాంగ్రెస్‌ ప్రకటించింది. దీంతో సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ చైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ ఎన్నికలకు  ఏర్పాట్లు పూర్తి చేశారు.  2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2020లో జీ–23 పేరుతో కొందరు సీనియర్‌ నేతలు అధిష్టానంపై తిరుగుబాటు చెయ్యడంతో సోనియా పదవిని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు ఇంకా కొనసాగుతున్నారు.  

గాంధీ కుటుంబానికే సారథ్యం  
నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతూ కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అని నినదిస్తున్న నేపథ్యంలో గాంధీ కుటుంబమే పార్టీకి రథసారథిగా ఉండాలన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు తెరతీస్తూ ఎదురు తిరిగిన వారిపై సీబీఐ, ఈడీ అస్త్రాన్ని ప్రయోగిస్తోందన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో గాంధీ కుటుంబానికి చెందిన వారే పార్టీ పగ్గాలు చేపట్టాలని పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. అయితే రాహుల్‌ గాంధీ మనసులో ఏముందో ఎవరికీ అర్థం కావడం లేదు. అధ్యక్ష పదవిపై ఆయన వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. మరోవైపు బీజేపీ పదే పదే వంశపారంపర్య రాజకీయాలను ఎత్తి చూపిస్తూ ఉండడంతో ఆ తరహా రాజకీయాలపై దేశంలో కొంత వ్యతిరేకత ఏర్పడింది.

ఈ పరిస్థితుల్లో మళ్లీ తాను అధ్యక్ష బాధ్యతలు చేపడితే ఆత్మరక్షణలో పడిపోతానని, ఆ పదవి తనని మరింత బలహీనుడిగా మారుస్తుందన్న ఆందోళన రాహుల్‌ గాంధీలో ఉందని రాజకీయ విశ్లేషకుడు రషీద్‌ కిద్వాయ్‌ అభిప్రాయపడ్డారు. ‘‘24 అక్బర్‌ రోడ్‌: ఏ షార్ట్‌ హిస్టరీ ఆఫ్‌ ది పీపుల్‌ బిహైండ్‌ ది ఫాల్‌ అండ్‌ రైజ్‌ ఆఫ్‌ ది కాంగ్రెస్‌’’తో పాటు పలు పొలిటికల్‌ పుస్తకాలు రచించిన ఆయన రాహుల్‌ ఆందోళన సరైనదే అయినప్పటికీ గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులే సారథిగా ఉంటేనే అధికార పార్టీ వారిని టచ్‌ చేయడానికి జంకుతుందని అభిప్రాయపడ్డారు. ప్రియాంక గాంధీని అధ్యక్షురాలిగా చేస్తే కాంగ్రెస్‌కి పూర్వ వైభవం వస్తుందని ఇటీవల ఉదయ్‌పూర్‌ చింతన్‌ శిబిర్‌లో కొందరు నాయకులు డిమాండ్‌ చేసినప్పటికీ ఆమె మాత్రం అందుకు సుముఖంగా లేరు.    

బయటవారికే ఇస్తే.. ?
గాంధీ కుటుంబం కాకుండా బయటవారు  కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి వస్తుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు మానసికంగా సంసిద్ధులవుతున్నారు. అలాంటప్పుడు పార్టీ పగ్గాలు ఎవరు స్వీకరిస్తే బాగుంటుందన్న చర్చ కూడా మొదలైంది.  సీనియర్‌ నాయకులు డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే, సుశీల్‌ కుమార్‌ షిండే, అశోక్‌ గెహ్లాట్, కుమారి సెల్జా వంటి నాయకులైతే బాగుంటుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

స్వాతంత్య్రదినోత్సవం నాడు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో అంబికా సోని జాతీయ జెండాని ఎగురవేయడంతో ఆమె కూడా రేసులో ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. సోనియాకి కరోనా సోకడంతో అంబికా సోని జెండా ఎగురవేశారే తప్ప ఆమెకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పని లేదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.  బయటవారు కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టే పరిస్థితి రాదని, ఎన్నికలొచ్చే సమయానికి రాహుల్‌ని ఒప్పించగమన్న ధీమాలో ఓ వర్గం ఉంది.  

రాహుల్‌ అంగీకరించకపోతే...?  
ఒకవేళ రాహుల్‌ గాంధీ అధ్యక్షుడు అవడానికి సుముఖంగా లేకపోతే సోనియాగాంధీయే అధ్యక్షురాలిగా ఉండి ఆమెకు సహాయంగా కనీసం ముగ్గురు సీనియర్‌ నాయకుల్ని కార్యనిర్వాహక అధ్యక్ష పదవిలో నియమించాలని కొందరు నాయకు లు అభిప్రాయపడుతున్నారు. బయట వారికి పార్టీ పగ్గాలు అప్పగించి రాహుల్‌ గాంధీ వారికి ఒక గైడ్‌లా వ్యవహరిస్తే కుటుంబ రాజకీయాల విమర్శల నుంచి బయటపడవచ్చునని మరి కొందరి ఆలోచనగా ఉంది. గాంధీ కుటుంబానికి మన్మోహన్‌ సింగ్‌ లాంటి అత్యంత నమ్మకమైన నాయకుడి అవసరం కూడా ఉంది. కానీ  కాగడా పెట్టి వెతికినా అలాంటి నాయకుడెవరూ కనిపించడం లేదని, ఇప్పుడు పార్టీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అదేనని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మణీంద్ర నాథ్‌ ఠాకూర్‌ అభిప్రాయపడ్డారు. 

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top