కేజ్రీవాల్‌కు షాక్‌.. చ‌ద్దాకు జాక్‌పాట్‌? | Why Raghav Chadha quit Aam Aadmi Party details inside | Sakshi
Sakshi News home page

'ఆప్‌'కు చ‌ద్దా గుడ్‌ బై.. కార‌ణం అదేనా?

Apr 24 2026 5:09 PM | Updated on Apr 24 2026 5:17 PM

Why Raghav Chadha quit Aam Aadmi Party details inside

అనుకున్న‌దే జ‌రిగింది. కొంత కాలంగా కేజ్రీవాల్‌కు కంట్లో న‌లుసులా త‌యారైన రాజ్య‌స‌భ స‌భ్యుడు రాఘ‌వ్ చ‌ద్దా త‌న అస‌లు రంగు బ‌య‌ట‌పెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీని వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న కాషాయ పార్టీతో జ‌ట్టుక‌డుతున్నట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు. త‌న‌తో పాటు ఆరుగురు ఆప్‌ ఎంపీలు కూడా బీజేపీ గూటికి వ‌స్తున్నారంటూ బాంబు పేల్చారు. రాజ్య‌స‌భ‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప‌క్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్న‌ట్టు వెల్ల‌డించి రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు రేపారు. గోడ దూకుతున్న ఎంపీల్లో మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, స్వాతి మ‌ల్లివాల్, సందీప్ పాఠ‌క్‌, (Sandeep Pathak) అశోక్ మిట్ట‌ల్‌, రాజిందర్ గుప్తా, విక్రమ్‌జీత్ సింగ్ సాహ్ని ఉన్నారు.

కొంత కాలంగా సొంత‌ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్న రాఘ‌వ్ చ‌ద్దా.. కేంద్రంలోని మోదీ స‌ర్కారుపై మెత‌క‌వైఖ‌రి అవ‌లంభిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప‌లు అంశాల్లో ఎన్డీఏ స‌ర్కారు విధానాల‌ను ఆమ్ ఆద్మీ పార్టీ వ్య‌తిరేకించినా ఆయ‌న మాత్రం మిన్న‌కుండిపోయారు. అంతేకాదు ప‌లుమార్లు పార్టీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌ను తెచ్చిపెట్టారు. ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసు నుంచి ఆప్ అధినేత కేజ్రీవాల్‌, మాజీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియాను కోర్టు నిర్దోషులుగా ప్ర‌క‌టించినా.. చ‌ద్దా నుంచి క‌నీస స్పంద‌న కూడా రాలేదు. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉండే ఆయ‌న క‌నీసం ఒక ట్వీట్ కూడా పెట్ట‌లేదు.  

చ‌ద్దాతో పాటు మిట్ట‌ల్ కూడా..
అలాగే పార్ల‌మెంట్‌లో మోదీ స‌ర్కారును ఇబ్బంది పెట్ట‌కుండా న‌డుచుకున్నార‌నే అప‌వాదును సొంత పార్టీ నుంచే ఎదుర్కొన్నారు చ‌ద్దా. కేంద్రం తీసుకున్న వివాదాస్ప‌ద అంశాల‌ జోలికి వెళ్ల‌కుండా సాధార‌ణ స‌మ‌స్య‌ల‌ను పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావించార‌నే ఆరోప‌ణ‌లూ ఆయ‌నపై ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో రాజ్య‌స‌భ‌లో ఉప నాయ‌కుడి ప‌ద‌వి నుంచి ఇటీవ‌ల చ‌ద్దాను ఆమ్ ఆద్మీ పార్టీ తొలగించింది. ఆయ‌న స్థానంలో అశోక్ మిట్ట‌ల్‌ను (Ashok Mittal) నియ‌మించింది. అయితే చ‌ద్దాతో పాటు మిట్ట‌ల్ కూడా ఇప్పుడు కాషాయ పార్టీలోకి జంప్ చేయ‌డం గ‌మ‌నార్హం.

రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు
రాఘ‌వ్ చ‌ద్దా.. ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెబుతార‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. రాజ్య‌స‌భ‌లో పార్టీ డిప్యూటీ లీడ‌ర్‌ ప‌ద‌వి నుంచి తొల‌గించడం, త‌న‌కు ఇచ్చిన జ‌డ్ ప్ల‌స్ భ‌ద్ర‌త‌ను పంజాబ్ ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకోవ‌డంతో క‌మ‌లం గూటికి చ‌ద్దా చేర‌తార‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఏకంగా త‌నతో పాటు ఆరుగురు ఎంపీల‌ను పార్టీని వీడేలా చేసి రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపారు. రాజ్య‌స‌భ‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప‌క్షాన్ని బీజేపీలో క‌లిపేసి కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చారు.

కేంద్ర కేబినెట్‌లోకి చ‌ద్దా?
పార్టీ ఫిరాయింపును ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా స‌మ‌ర్థించుకున్నారు. తాను ఆమ్ ఆద్మీ పార్టీకి దూర‌మై ప్ర‌జ‌ల‌కు చేరువుతున్నాన‌ని చెప్పుకొచ్చారు. మ‌రోవైపు కేంద్ర కేబినెట్‌లో చ‌ద్దాకు చోటు క‌ల్పించేందుకు రంగం సిద్ధ‌మైంద‌న్న ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. కాగా, ప‌శ్చిమ బెంగాల్ రెండో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు ఈ ప‌రిణామం చోటుచేసుకోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్‌టాపిక్ అయింది.

చ‌ద‌వండి: 'ఆ ఏడుగురిని గుర్తుపెట్టుకుంటాం'

టార్గెట్ పంజాబ్ ఎన్నిక‌లు
పంజాబ్‌లో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు బీజేపీ ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల‌ను త‌మ‌వైపు తిప్పుకుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఢిల్లీలో ఆప్‌ను దెబ్బ‌కొట్టిన క‌మ‌లం పార్టీ పంజాబ్‌లోనూ కేజ్రీవాల్‌కు చెక్ పెట్టాల‌ని వ్యూహ‌ర‌చ‌న చేస్తోంద‌ని చెబుతున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాఘ‌వ చ‌ద్దాను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించినా ఆశ్చ‌ర్యపోవాల్సిన అవ‌స‌రం లేదని విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రోవైపు ఇప్ప‌టికే ఇంటా బ‌య‌ట స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత తాజా సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement