ఏఐని ఆపేయండి బాబోయ్‌! | Why Is Anthropic Calling for a Pause on AI Development? Here's What’s Behind the Warning | Sakshi
Sakshi News home page

ఏఐని ఆపేయండి బాబోయ్‌!

Jun 7 2026 7:30 AM | Updated on Jun 7 2026 11:01 AM

Why Is Anthropic Calling for a Pause on AI Development? Here's What’s Behind the Warning

ఇందుగలడందు లేడన్న సందేహంబు వలదన్నట్టు... ఏఐ ఇప్పుడు అన్ని రంగాల్లోకి చేరిపోతోంది. కంపెనీలు వందల కోట్ల డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. ఉద్యోగాల కోత ఉంటుందా? ఉండదా? అన్నదానిపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి. అయితే... ప్రపంచంలోనే అత్యంత విలువైన కృత్రిమ మేధ సంస్థ ఆంథ్రోపిక్‌ మాత్రం ‘‘ఆపేయండి..’’ అని అరుస్తోంది. సమయం మీరిపోకముందే కృత్రిమ మేధ వాడకాన్ని తాత్కాలికంగానైనా నిలిపేయాలని కోరుతోంది. ఎందుకలా?

‘టెర్మినేటర్‌ –2.. జడ్జ్‌మెంట్‌ డే’, ‘ఎక్స్‌ మెషీనా’, ‘ద మ్యాట్రిక్స్‌’... మూడు హాలీవుడ్‌ సినిమాలే. మూడింటి స్టోరీ కూడా దాదాపు ఒకటే. మనిషి సృష్టించిన కృత్రిమ మేధ మనిషిపైనే పెత్తనం చెలాయించడం. ఆఖరుకు హీరో ఏఐ వ్యవస్థలను పటాపంచలు చేసి మనుషులను కాపాడతాడన్న మాట. నిజజీవితంలో ఇంత విపత్తు అయితే రాలేదు కానీ.. ఆ రోజు ఎంతో దూరంలో లేదు అంటోంది ఆంథ్రోపిక్‌. 

రెండు రోజుల క్రితం ఈ విషయమై కంపెనీ తన బ్లాగ్‌లో ఓ సుదీర్ఘమైన పోస్టు పెట్టింది. ఆంథ్రోపిక్‌ క్లాడ్‌ పేరుతో ఏఐ ఏజెంట్‌ ఒకదాన్ని సృష్టించిన సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకొన్ని నెలల్లో మా కంపెనీలో ఇంజినీర్లు ఎవరూ సాఫ్ట్‌వేర్‌ కోడ్‌ రాయరు అని ఈ కంపెనీ సీఈవో ఈ మధ్యే చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల ఉద్యోగాలను ఈ క్లాడ్‌ ఏఐ చేసి పడేస్తుందని కూడా భవిష్యవాణి పలికాడు. అయితే తాజాగా ఈ కంపెనీ ఇంజినీర్లు క్లాడ్, దీని అనుబంధ ఏఐ వ్యవస్థల పురోగతిని పరిశీలించి... ఏదో తేడా కొడుతున్నట్లు అర్థం చేసుకున్నారు. 

వారి అంచనా ప్రకారం.. ఈ ఏఐ వ్యవస్థలు ఇప్పటి మాదిరే ముందుకు వెళితే.. అవి చాలా తొందరగా ‘రికర్సివ్‌ సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌’ను అందుకోగలవని వీరు గుర్తించారు. అదే జరిగితే ఈ ఏఐ వ్యవస్థలు తమని తాము మెరుగుపరుచుకునేందుకు సొంతంగా కోడ్‌లు రాసేసుకుంటాయని ఫలితంగా మన నియంత్రణలో లేకుండా పోతాయని వీరు అంటున్నారు. అందుకే ఏఐ వ్యవస్థలు ఈ రికర్సివ్‌ సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ సాధించాయో లేదో తెలుసుకునేందుకు ఒక పద్ధతిని సిద్ధం చేసుకునేంత వరకూ అయినా ఏఐ వాడకాన్ని నిలిపివేయాలని ఈ కంపెనీ పిలుపునిచ్చింది. 

ఏంటీ రికర్సివ్‌ సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌?
ఏదైనా పనిలో అత్యున్నత నైపుణ్యాన్ని సాధించేందుకు మనం ఏం చేస్తాం? లోటుపాట్లు గుర్తించి వాటిని దిద్దుకుంటాం. తద్వారా మెరుగైన పనితీరు అబ్బుతుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం.. ఓ ఏఐ రోబోకు ఉప్మా చేయడమెలాగో నేర్పామని అనుకుందాం. తిరగమోత పెట్టి, రవ వేయించి తెర్ల కాగుతున్న నీళ్లు పోసి ఉప్మా తయారు చేసింది ఆ రోబో. ఈ క్రమంలోనే నీళ్లు కాగడానికి చాలా సమయం పడుతున్నట్లు గుర్తించిందనుకోండి. ఇది రికర్సివ్‌ సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ సాధించిన రోబో అయితే.. వెంటనే నీళ్లు మరింత వేగంగా ఎలా కాయాలో గుర్తించి అందుకు తగ్గట్టుగా స్టౌ లేదా హీటర్‌ సెట్టింగ్స్‌లో మార్పులు చేస్తుంది. 

తద్వారా ఉప్మా వేగంగా తయారవుతుంది. సమయం ఏదైనా మిగిలితే రుచికరమైన చట్నీ తయారు చేస్తుంది. బాగానే ఉంది కదా అనిపిస్తోందా? నిజమే కానీ.. ఈ మార్పులన్నీ అది మానవ పర్యవేక్షణ లేకుండానే చేస్తూంటుంది. ఉప్మా స్థానంలో ఓ అణు రియాక్టర్‌ నిర్వహణను ఊహించుకోండి? భద్రత కోసం మనిషి చేసిన ఏర్పాట్లలో ఏదో చిన్న లోపం ఉందని మార్చేస్తే... కొంపలు అంటుకుపోతాయి!

అంత తొందరగా కాదు..
ఈ మొత్తం వ్యవహారంలో కొంచెం ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. క్లాడ్‌ దాని అనుబంధ ఏఐ వ్యవస్థలేవీ రికర్సివ్‌ సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ స్థాయికి చేరుకోకపోవడం. అయితే వీటి వేగం చూస్తూంటే.. ముందు అనుకున్న దాని కంటే చాలా వేగంగానే ఆ స్థాయికి చేరతాయని కంపెనీ చెబుతోంది. ‘‘ఏఐ అభివృద్ధిని మందగింప జేసేందుకు లేదంటే తాత్కాలింగా నిలిపివేసేందుకు ఏదైనా ఏర్పాటు ఉంటే ప్రపంచానికి మేలు’’అని ఇప్పుడు ఆంథ్రోపిక్‌ స్వయంగా చెబుతోంది. ఈ మధ్యకాలంలో రికర్సివ్‌ సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ను గుర్తించేందుకు, నివారించేందుకు లేదా నియంత్రించేందుకు మనిషి తగిన ఏర్పాట్లు చేసుకోవచ్చునని ఈ కంపెనీ అంచనా వేస్తోంది. అయితే ఈ పని అంత సులువేమీ కాదని... ఏఐ అన్నది నిశ్శబద్ధంగా ఏ మారుమూల సర్వర్‌లోనో వృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి.. దాన్ని గుర్తించడం, నిలిపివేయడం అంత సులువు కాదని వివరించింది. 

అంతా ఉట్టిదే...
లక్ష కోట్ల డాలర్ల విలువైన ఆంథ్రోపిక్‌ ఏఐ వాడకాన్ని నిలిపివేయాలని పిలుపునివ్వడంపై ఇప్పటికే కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదో ఎర అని గేరీ మార్కస్‌ అనే ఏఐ విమర్శకుడు వ్యాఖ్యానించారు. ఆంథ్రోపిక్‌ ఈ బ్లాగ్‌ ద్వారా అందరిలోనూ భయం నింపే ప్రయత్నం చేస్తోంది. కానీ ఏఐ వ్యవస్థలు రికర్సివ్‌ సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ స్థాయికి చేరుకున్నాయి అనేందుకు రుజువులేవీ లేవు. క్లాడ్‌ ఏఐ కోడింగ్‌ వేగం బాగా పెరిగింది అంతే. అని వివరించాడు.    

– నేషనల్‌ డెస్క్, సాక్షి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement