‘టూల్‌కిట్’‌‌ అంటే ఏంటి...

What Is A Toolkit That Led To Disha Ravi Arrest - Sakshi

టూల్‌కిట్‌ పూర్తి వివరాలు

టూల్‌కిట్‌, గ్రెటా థన్‌బర్గ్‌, దిశ రవిల మధ్య ఉన్న సంబంధం

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా కొందరు ప్రముఖులు రైతు ఉద్యమానికి మద్దతు తెలిపారు. అందులో స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ కూడా ఉన్నారు. రైతు ఉద్యమానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో గ్రెటా థన్‌బర్గ్ ఒక టూల్‌కిట్‌ని షేర్ చేశారు. ఇది‌ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు థన్‌బర్గ్‌‌పై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు.

ఇక జనవరి 26వ తేదీన ఢిల్లీలో రైతుల ఆందోళన సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలకు టూల్‌కిట్‌ ద్వారా సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ వివాదం కారణంగా బెంగుళూరుకు చెందిన 22 ఏళ్ల దిశ రవి అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై కూడా పై సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలన్నిటింకి మూల కారణం టూల్‌కిట్‌. అసలు ఏంటీ టూల్‌కిట్‌.. దీనిపై అంతర్జాతీయంగా వివాదం తలెత్తడానికి గల కారణాలేమిటి.. అందులో దిశ రవి పాత్ర ఏమిటి.. అనే విషయాలు తెలుసుకుందాం..

టూల్‌కిట్‌..
టూల్‌కిట్’‌ అంటే ఓ డాక్యుమెంట్‌. దేని గురించి అయినా వివరించే ఓ పత్రం, బ్లూ ప్రింట్‌ లాంటిది అని చెప్పవచ్చు. చరిత్రలో ఎన్నో ఉద్యమాలు నడిచాయి. కొన్ని ప్రపంచ గతినే మార్చేశాయి. తాజాగా గతేడాది అమెరికాలో ‘‘బ్లాక్ లైవ్స్‌ మాటర్’’, పర్యావరణానికి సంబంధించి క్లైమేట్ స్ట్రైక్ క్యాంపెయిన్ లాంటివి ఉన్నాయి. ఒకప్పుడు ఇలాంటి ఉద్యమాలు జరిగితే అందుకు సంబందించిన కార్యాచరణ, వ్యూహాలకు సంబంధించిన ప్రణాళికను కాగితాల మీద ముద్రించేవారు. దానిని ఆ ఉద్యమానికి మద్దతు తెలిపే వారికి చేరేలా చూసేవారు. 

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆ స్థానంలోకి టూల్‌కిట్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏ ఉద్యమం అయినా సరే దానికి సంబందించిన ఒక డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తారు. దీనినే టూల్‌కిట్‌ అంటారు. ఆ ఉద్యమంలో పాల్గొనాలనుకునే వారు, దానిపై ఆసక్తి ఉన్నా వారు ఎవరైనా సరే ఈ టూల్‌కిట్‌ని చదివితే ఉద్యమానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. అంటే ఉద్యమంలో ఏ రోజున ఎలాంటి కార్యక్రమం ఉంటుంది.. ఎక్కడెక్కడ ర్యాలీలు, దీక్షలు ఉంటాయి.. ఉద్యమం ఎలా ముందుకు వెళ్తోంది అనే సమాచారం టూల్‌కిట్‌ ద్వారా తెలుస్తుంది. ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి.. ఉద్యమానికి మద్దతు పెంచడానికి ఈ టూల్‌కిట్‌ని సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేస్తుంటారు. ప్రపంచం నలుమూలలా ఉన్న మద్దతుదారులను ఏకం చేయడంలో ఈ టూల్‌కిట్‌ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం కూడా ఇదే.

గ్రేటా థన్‌బర్గ్‌ పాత్ర
ఇలాంటి టూల్‌కిట్‌నే గ్రేటా థన్‌బర్గ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. దీనిలో దేశరాజధానిలో జరుగుతున్న ఉద్యమం ఏంటి.. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలు ఏంటి అనే వివరాలు ఉన్నాయి. ఈ టూల్‌కిట్‌లో ‘‘రైతులు సంపన్నలుగా, స్వాలంభన సాధించడానికి ఉద్దేశించిన ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఈ చట్టాలు అమల్లోకి వస్తే.. వ్యవసాయం కార్పొరేట్‌, అంతర్జాతీయ సంస్థల గుప్పిట్లోకి వెళ్తుంది. వాటి ప్రధాన లక్ష్యం లాభాలు. దాని కోసం ప్రకృతిని దోచుకుంటారు’’ అని దీనిలో ఉంది.

దిశ పాత్ర ఏంటి
అయితే రైతులకు మద్దతుగా గ్రెటా థన్‌బర్గ్‌ షేర్ చేసిన టూల్‌కిట్‌ని ‌దిశ రవి ఎడిట్ చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని దిశ రవి అంగీకరించినట్టుగా చెప్తున్నారు. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు. టూల్‌కిట్‌లోని రెండు మూడు లైన్లను ఎడిట్ చేసిన దిశ రవి ఆ తర్వాత అందులో అభ్యంతరకర విషయాలు ఉన్నాయంటూ తిరిగి గ్రేటాకు ట్వీట్ చేసింది. రైతులకు మద్దతివ్వడం కోసం ఇలా చేసానని ఆమె విచారణలో వెల్లడించారు. అంతేకాకుండా జనవరి 11న దిశ రవి, శాంతాను, నికితా అంతా జూమ్‌ యాప్‌ద్వారా వీడియో కాల్‌లో మాట్లాడుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను త్వరలోనే కోర్టులో ప్రవేశపెడతామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. 

కాగా గ్రెటా థన్‌బర్గ్‌ షేర్‌ చేసిన టూల్‌కిట్‌ను ఖలికిస్తాన్‌ ఉగ్రవాదులు తయారుచేసినట్లుగా ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ టూల్‌కిట్‌ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు ముగ్గురు యువతుల అరెస్ట్‌పై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కుట్రపూరింతగానే వీరిని అరెస్ట్‌ చేసిందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. 

చదవండి: టూల్‌కిట్‌ వివాదం: కీలక విషయాలు వెల్లడి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top