ఏకే–47 అంటే ఏమిటీ, ఆ పేరెలా వచ్చింది? | What Is Ak 47 Special Story Guns | Sakshi
Sakshi News home page

ఏకే–47 అంటే ఏమిటీ, ఆ పేరెలా వచ్చింది?

Sep 4 2020 3:33 PM | Updated on Sep 4 2020 3:39 PM

What Is Ak 47 Special Story Guns - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఏకే–47. ఈ పేరు వినగానే ఎవరికైనా అత్యాధునిక తుపాకీ అని అర్థం అవుతుంది. దీన్ని దేశాల మధ్య జరిగే యుద్ధాల్లోనే కాకుండా విప్లవాల్లో, సామాజిక తిరుగుబాట్లలో ఉపయోగించగా, అటు టెర్రరిస్టులు, ఇటు మావోయిస్టులు కూడా ఇప్పుడు వినియోగిస్తున్నారు. ఇది ఇంతగా ప్రాచుర్యం పొందడానికి కారణం సర్వకాల సర్వ పరిస్థితుల్లో, అంటే అత్యధిక వర్షం కురిసే రెయిన్‌ ఫారెస్టుల్లో, వడగాలులు వీచే ఎడారుల్లో, అతి శీతల మంచు కొండల్లో ఇది పని చేస్తుంది. అందుకే ప్రస్తుతం భారత్‌ వాడుతున్న ఇన్సాస్‌ రైఫిళ్లు మంచు ప్రాంతంలో పనిచేయక పోతుండడంతో, వాటి స్థానంలో ఏకే–47 రైఫిళ్లును రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్‌ ఆ దేశంతో బుధవారం ఒప్పందం చేసుకుంది.

ఏకే–47 తుపాకీ మోడల్‌
ఇంతకు ఏకే–47 తుపాకులంటే ఏమిటీ? వాటికి ఆ పేరు ఎలా వచ్చింది? ఏకే అంటే ఆటోమాట్‌ కలష్నికోవ అని, 47 అంటే 1947 సంత్సరం అని పూర్తి అర్థం. సోవియట్‌ యూనియన్‌కు  చెందిన మిహాయిల్‌ కలష్నికోవ దీన్ని కనిపెట్టడంతో ఆయన పేరు మీదనే ఇది ప్రఖ్యాతిచెందింది. మొదట్లో సోవియెట్‌ సైన్యం కోసం వీటిని రహస్యంగా తయారు చేశారు. 1919, నవంబర్‌ 10వ తేదీన జన్మించిన కలష్నికోవ రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సోవియెట్‌ యుద్ధ ట్యాంక్‌ మెకానిక్‌గా పని చేశారు. 1941లో సోవియెట్‌పై జర్మనీ దురాక్రమణ జరిపినప్పుడు ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సోవియెట్‌ సైనికుల వద్ద శక్తివంతమైన తుపాకులు లేకపోవడం వల్లనే వారితో పాటు తాను గాయపడాల్సి వచ్చిందని కలష్నికోవ భావించారు. అలాంటి తుపాకుల కోసం అహర్నిశలు శ్రమించారు. ఆ పరంపరలో అనేక మోడళ్ల అనంతరం ఆయన ఏకే–47 తుపాకీ మోడల్‌ను తయారు చేయగలిగారు. 1947లో మొట్టమొదటి సారిగా సోవియెట్‌ వీటి ఉత్పత్తిని ప్రారంభించింది. 1949లో దీన్ని అసాల్ట్‌ రైఫిల్‌గా సోవియట్‌ ఆర్మీ స్వీకరించింది.



వార్సా ఒప్పందం ద్వారా ఈ తుపాకులు వివిధ దేశాలకు చేరాయి. వియత్నాం, అఫ్గానిస్థాన్, కొలంబియా, మొజాంబిక్‌ విప్లవాల్లో ఏకే–47 తుపాకులను ప్రధానంగా ఉపయోగించారు. అందుకే వాటి జెండాల్లో ఏకే–47 తుపాకీ ఓ గుర్తుగా మిగిలిపోయింది. ఏకే–47 తుపాకుల ఉత్పత్తి దాదాపు దశాబ్దంపాటు  కొనసాగింది. 1959లో ఏకేఎం పేరిట కొత్త వర్షన్‌ వచ్చింది. ఏకే–47 తుపాకుల బరువును తగ్గించి, కాస్త చౌక ధరకు ఈ కొత్త వర్షన్‌ను ఉత్పత్తి చేశారు. ఆ తర్వాత కలష్నికోవ ఆ వర్షన్‌ను కూడా మార్చి కార్టిడ్జ్‌ కలిగిన పీకే మషిన్‌ గన్‌ను తయారు చేశారు. ఇలా పలు రకాల వర్షన్లు వచ్చినప్పటికీ ప్రపంచంలో పలు దేశాలు ఇప్పటికీ ఆధునీకరించిన ఏకే–47 తుపాకులను ఉత్పత్తి చేస్తున్నాయి. కలష్నికోవ అప్పటికి అమెరికా సైన్యం ఉపయోగిస్తున్న ఎం–16 తుపాకులకన్నా శక్తివంతంగా ఏకే–47ను తయారు చేయాలన్నా సంకల్పంతోనే ఆయన అందులో పలు వర్షన్లు తీసుకొచ్చారు. ‘అమెరికా సైనికులు తమ ఎం–16 తుపాకులను విసిరిపారేస్తారు. ఏకే–47 తుపాకులను లాక్కుంటారు. వాటి బుల్లెట్ల కోసం చనిపోయిన సైనికుల మత దేహాల నుంచి తీసుకుంటారు’ అని కలష్నికోవ్‌ వియత్నాం యుద్ధం సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను ఓ పత్రికా ఇంటర్వ్యూలో గుర్తు చేశారు. ఆ తర్వాత అమెరికా సైనికులు నిజంగా ఇరాక్‌ యుద్ధంలో ఏకే–47 తుపాకులు ఉపయోగించినట్లు తాను విన్నానని కూడా ఆయన చెప్పారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఏకే–47 తుపాకుల్లో తక్కువలో తక్కువగా 50 అమెరికా డాలర్లకు దొరికే వర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంతటి ప్రఖ్యాతి చెందిన తుపాకీ వర్షన్లను సష్టించిన మిహాయిల్‌ కలష్నికోవ్‌ను స్టాలిన్‌ ప్రైజ్, ఆర్డర్‌ ఆఫ్‌ లెనిన్‌ అవార్డులు వరించగా, ‘మా ప్రజల సజనాత్మక మోథోసంపత్తికి అసలైన చిహ్నం’ కలష్నికోవ్‌ను 2007లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ అభివర్ణించారు. కలష్నికోవ్, 2013లో తన 94వ ఏట మరణించారు. తాను ఆత్మరక్షణ కోసం సష్టించిన ఏకే–47, ఎదురు దాడులకే కాకుండా టెర్రరిస్టుల చేతుల్లో సామాన్యుల ప్రాణాలు తీసుకుంటున్న విషయం తెల్సి కలష్నికోవ్‌ తన చివరి రోజుల్లో ఎంతో వ్యథ చెందారు. ‘భరించలేని బాధతో నా హదయం కొట్టుమిట్టాడుతోంది. నేను కనిపెట్టిన ఆయుధం ప్రజల ప్రాణాలను తీసినట్లయితే అందుకు పూర్తిగా నేనే బాధ్యుడిని’ అని కలష్నికోవ్‌ తన చివరి రోజుల్లో రష్యన్‌ ఆర్థడాక్స్‌ చర్చి ఫాదర్‌కి రాసిన లేఖలో పేర్కొన్నారు. 1945లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాల్లో అమెరికా వేసిన బాంబుల వల్ల దాదాపు రెండు లక్షల మంది మరణించగా, ప్రపంచవ్యాప్తంగా ఏకే–47 తుపాకుల వల్ల కొన్ని కోట్ల మంది ప్రజలు మరణించారన్నది ఓ అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement