సింఘు సరిహద్దులో వ్యక్తి హత్య: ‘అతను అలాంటివాడు కాదు.. ఆశ చూపి’

Was Lured, Voices From Village: Man Killed At Farmers Protest Near Delhi Border - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ-హర్యానా సరిహద్దు సమీపంలోని సింఘు ప్రాంతం వద్ద శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేస్తున్న క్రమంలో వ్యక్తి చేతులు, కాళ్లు నరికిన మృతదేహం బారికేడ్లకు వేలాడుతూ కనిపించింది. హత్యకు గురైన వ్యక్తిని లఖ్‌బీర్ సింగ్‌ (35)గా  పోలీసులు గుర్తించారు. పంజాబ్‌లోని తార్న్ తరణ్ జిల్లాలోని చీమా ఖుర్ద్ గ్రామ నివాసి. అతను ఓ దళితుడు. రోజూవారీ కూలీ పనులు చేసుకొని జీవించేవాడు. అతనికి భార్య ముగ్గురు కుమార్తెలు, ఓ సోదరి  ఉన్నారు. అతనిపై ఎలాంటి నేర చరిత్ర గానీ, ఏ రాజకీయ పార్టీతో సంబంధం గానీ లేదని పోలీసులు తెలిపారు.
చదవండి: ప్రియుడితో కలిసి మామను హత్య చేసిన కోడలు

అయితే సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేశాడన్న ఆరోపణలతో కొందరు వ్యక్తులు ఆయన్ను కొట్టి చంపినట్లుగా కొన్ని వీడియోలు ప్రచారమవుతున్నాయి.  కానీ బాధితుడి సొంత గ్రామమైన పంజాబ్‌లోని చీమా ఖుర్ద్ నివాసితులు మాత్రం సిక్కుల పవిత్ర గ్రంథాన్ని అపవిత్రం చేసినందుకు అతన్ని హత్యకు గురయ్యాడనే వాదనలను ఖండించారు. ఉద్ధేశ్యపూర్వకంగా బాధితుడికి ఆశ చూపి సింఘు సరిహద్దు వద్దకు తీసుకెళ్లి చంపేశారని ఆరోపిస్తున్నారు.

అతను బానిస అని, ఏదో ఆశ చూపించి చంపారని తర్న్ తరణ్ జిల్లాలోని గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది హర్భజన్ సింగ్ అన్నారు. బాధితుడు లఖ్‌బీర్ సింగ్ 4, 5 రోజుల క్రితం గ్రామంలో ఉన్నాడని, అతని దారుణ హత్య వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోయారని చెప్పారు. అతను నిరుద్యోగి అని, కుంటుంబాన్ని కూడా పోషించలేడని విచారం వ్యక్తం చేశారు. గ్రామంలోని అనేకమంది సైతం బాధితుడు చెప్పిన పని చేసే బానిసగా పేర్కొన్నారు. సిక్కుల పవిత్ర గ్రంధాన్ని అపవిత్రం చేసిన ఘటనలో బాధితుడు పాత్ర లేదని, అతను అలాంటి వ్యక్తి కాదని పేర్కొన్నారు.  

అయితే, ఈ హత్య కేసులో ఒక వ్యక్తి లొంగిపోయాడు. అతడు నిహాంగ్‌ గ్రూప్‌ సభ్యుడు సరబ్‌జిత్ సింగ్ అలియాస్​ నిహాంగ్​ సిఖ్​గా పోలీసులు తెలిపారు. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసినందుకే అతడిని శిక్షించానంటూ మీడియా ముందుకు వచ్చిన అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించిన వీడియో..సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న  పోలీసులు శనివారం కోర్టులో హాజరుపరుచనున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top