
పహల్గాం దాడిలో తండ్రిని కోల్పోయిన తొమ్మిదేళ్ల బాలుడు
బాలాసోర్: ‘భారత సైన్యంలో చేరి పాక్ ఉగ్రవాదులను అంతమొందించాలనుకుంటున్నా’పహల్గాం దాడిలో తండ్రిని కోల్పోయిన ఓ బాలుని కోరిక ఇది. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నానని తొమ్మిదేళ్ల తనూజ్ కుమార్ సత్పతి గురువారం వెల్లడించాడు. అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం వస్తే.. తనలా ఏ బిడ్డా తండ్రిని కోల్పోకుండా చూడాలని చెబుతానన్నాడు.
తనూజ్ తండ్రి ప్రశాంత్ సత్పతి పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం వారి కుటుంబాన్ని మీడియా కలవగా.. తనూజ్ మాట్లాడాడు. ‘‘నేనూ, అమ్మ బుధవారం ఉదయం నుంచి వార్తలు చూస్తూనే ఉన్నాం. పాక్ ఉగ్ర స్థావరాలపై దాడి మాకు చయాలా సంతృప్తినిచ్చింది. మన సైన్యాన్ని చూసి గరి్వస్తున్నా’’అని తెలిపాడు. అంతేకాదు.. సైన్యం మొదటి నుంచి తనకు, తన తల్లికి అండగా ఉందని తనూజ్ చెప్పారు.
‘‘కొండపై నుంచి కిందకు వస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారని చెప్పాడు. ‘‘నాన్న వెంటనే పడిపోయాడు. నేను, అమ్మ అతని దగ్గరికి పరిగెత్తాం. తల నుంచి రక్తస్రావం అవుతోంది. నీళ్లు కావాలా అని అమ్మ అడగ్గానే.. అవునన్నాడు. నీళ్లు ఇచ్చాను’’అని పహల్గాంలో జరిగిన భయానక పరిస్థితులను తనూజ్ గుర్తు చేసుకున్నాడు. తనూజ్ పెద్దరికంగా మాట్లాడుతుండటంపై అతని తల్లి ప్రియా దర్శిని ఆందోళన వ్యక్తం చేసింది.‘‘అతను అకస్మాత్తుగా తన బాల్యాన్ని కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. పిల్లలు క్రమంగా పరిణితి చెందాలి. భగవంతుడు నా కొడుకును ఆశీర్వదించాలి’’అని ఆమె కోరుకున్నారు.