ఆన్‌లైన్‌ పెళ్లి; వామ్మో ఇన్ని రకాల వంటలా!

Viral Tweet Tamil Family Sends Food To Online Wedding Attendees - Sakshi

ఒకప్పుడు పెళ్లిళ్లంటే కొబ్బరాకులతో ఇంటి ముందు పందిరి.. అరిటాకుల్లో బంతి భోజనాలు.. అంతా కలిసి ఒక్కచోట చేరి ముచ్చట్లు పెట్టే దృశ్యాలు.. వివాహ తంతు ముగిశాక బ్యాండ్‌ బాజాలతో ఊరేగింపులు గుర్తుకు వచ్చేవి.. అయితే కాలక్రమేణా పెళ్లి వేదిక ఫంక్షన్‌హాళ్లకు మారింది. ఇక సంపన్నులైతే డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ పేరిట సుదూర ప్రాంతాలకు బంధు గణాన్ని తరలించి అత్యంత వైభవోపేతంగా వివాహాలు జరిపించే పోకడలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే.. కరోనా మహమ్మారి దెబ్బకు చాలా మంది శుభకార్యాలు వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం కోవిడ్‌ కారణంగా సుముహుర్తాన్ని వదులుకోవడం ఇష్టంలేక అత్యంత సన్నిహితుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 

ఇక లాక్‌డౌన్‌ కాలంలో మెజారిటీ ప్రజలు ఆన్‌లైన్‌లో వివాహ తంతు కానిచ్చేసి ఆశీర్వచనాలు అందుకున్నారు. వీడియోకాల్‌లో ఆశీస్సులు ఓకే.. మరి భోజనం సంగతి ఎలా? శుభమస్తు అని దీవించిన బంధువర్గానికి విందు భోజనం పెట్టేదెలా? కల్యాణ సాపాడు పెట్టడం కనీస మర్యాద కదా! అదే పాటించకపోతే ఎలా? ఇలాంటి ఆలోచనలే వెంటాడాయి ఓ తమిళ కుటుంబాన్ని! అందులో పెద్దగా ఆలోచించాల్సి ఏముంది.. ఏ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థనో ఆశ్రయిస్తో సరిపోతుంది కదా అంటారేమో! అదీ నిజమే.. అయితే వాళ్లు డిజిటల్‌ అతిథులను కేవలం సాదా సీదా భోజనంతో సరిపెట్టేయాలనుకోలేదు. (చదవండి: అందుకే హనీమూన్‌ రద్దు చేసుకున్నారు!)

అందుకే ఆహ్వాన పత్రికతో పాటు అచ్చమైన సంప్రదాయ పద్ధతిలో బుట్టభోజనం, అరిటాకులు, 18 రకాల వంటకాలను పంపించారు. మ్యారేజ్‌ వెబ్‌కాస్ట్‌ వివరాలతో పాటు భోజనాన్ని ఎలా ఆర్గనైజ్‌ చేసుకోవాలో కూడా వివరించే కార్డును కూడా పంపారు. హాయిగా పెళ్లిభోజనం చేస్తూ కంప్యూటర్ల ముందుకు కూర్చుని వధూవరులను ఆశీర్వదించమని కోరారు. ఈ వినూత్న ఆహ్వానాన్ని అందుకున్న శివానీ అనే నెటిజన్‌ ఇందుకు సంబంధించిన విశేషాలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌ అవుతున్నాయి. డిసెంబరు 10న వివాహ బంధంతో ఒక్కటైన శివప్రకాశ్‌, మహతి జంటకు నెటిజన్ల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top