మా రాష్ట్రంలో బంద్‌ పాటించం: విజయ్‌ రూపాని

Vijay Rupani Says No Shutdown In Gujarat On December 8 - Sakshi

న్యూఢిల్లీ:  నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు డిసెంబర్‌ 8న తలపెట్టిన భారత్ బంద్‌ను తమ రాష్ట్రం పాటించదని గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. ఈ చట్టాల విషయంలో రైతులలో అసంతృప్తి లేదని భావిస్తున్నానన్నారు. బంద్ పేరిట శాంతిభద్రతలకి విఘతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ప్రభుత్వంతో రైతుల ఐదవ రౌండ్ చర్చలు విఫలమవ్వడంతో, కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ మార్గాలలో బైటాయించిన విషయం తెలిసిందే. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో డిసెంబర్ 9న ప్రభుత్వం మరో సమావేశాన్ని కేంద్రం ప్రతిపాదించింది. వృద్ధులు, మహిళలు, పిల్లలను నిరసన స్థలాల నుంచి వారి ఇళ్లకు తిరిగి పంపమని వారిని అభ్యర్థించింది.

అందుకే నిరసనలో పాల్గొంటున్నారు: కేంద్ర మంత్రి
కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ విపక్షాల తీరును తప్పుబట్టారు. ‘‘ప్రతిపక్ష పార్టీలు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి. యుపీఏ పాలనలో చేయలేని వ్యవసాయ రంగంలో సంస్కరణలు ఈ రోజు మోడీ ప్రభుత్వం చేస్తున్నది. ఇప్పుడు వారు ఎన్నికలలో ఓడిపోతున్నారు. తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రతిపక్షాలు ఏ నిరసనలోనైనా పాల్గొంటారు’’ అని విమర్శించారు. ఇదిలా ఉండగా.. వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ విజ్ఞప్తి చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే ఎంఎస్‌పీ (కనీస మద్దతు ధర) ను ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెడుతుందో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇక కొత్త చట్టాలను రద్దు చేయాలనే లక్ష్యంతో ఆందోళన చేస్తున్న రైతులు డిసెంబర్ 8న 'భారత్ బంద్'కు పిలుపునిచ్చారు. వారి డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోతే దేశ రాజధానికి వెళ్లే మరిన్ని రహదారులను అడ్డుకుంటామని, ఆందోళనలను తీవ్రతరం చేస్తామని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top