
సాక్షి, న్యూఢిల్లీ: విద్యాబోధన అనేది విద్యార్థులకు విషయాన్ని చేరవేయడంగానే కాకుండా, వారిలో సృజనాత్మకత, పరిశోధనాసక్తిని పెంపొందించేదిగా ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. తరగతి గదుల్లో బోధించే విద్యకు ఆన్‌లైన్ విద్యాబోధన సరైన ప్రత్యామ్నాయం కాదని అన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విద్యాభ్యాసాన్ని సమన్వయం చేస్తూ.. అందరికీ ఆమోదయోగ్యమైన మిశ్రమ విద్యావిధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘ప్రపంచ విశ్వవిద్యాలయాల సదస్సు’ను ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణం నుంచి బుధవారం వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యను అందించడం మాత్రమే కాకుండా, వివిధ రంగాల్లో నాయకులుగా ఎదిగేలా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కాగా దేశంలో కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగంలో మరింత క్రమశిక్షణను పెంపొందించుకునేందుకు అవకాశం కలిగిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా గ్రామీణ, పట్టణ అంతరాలను తగ్గించుకుంటూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమానస్థాయిలో విద్యాబోధన అందించేందుకు మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పేదరికం, అసమానతలు, అటవీ సంపద విధ్వంసం, కాలుష్యం తదితర అంశాలతో ఏర్పడ్డ సవాళ్లు, సమస్యల పరిష్కారానికి సుస్థిరాభివృద్ధి ఒక్కటే సరైన మార్గమని అన్నారు.
ఈ దిశలో విశ్వవిద్యాలయాలు పరిష్కార మార్గాలు, కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. అంతే గా క వేదాలు, ఉపనిషత్తుల ఘనమైన వారసత్వాన్ని వాటిలోని జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరోసారి భారతదేశాన్ని విశ్వగురువుగా, విజ్ఞాన కేంద్రంగా నిలబెట్టాల్సిన సరైన తరుణమిదేనని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.