రూ. 31 లక్షల కట్నాన్ని తిరస్కరించిన వరుడు
వరకట్నం మహమ్మారి కోరల్లో చిక్కుకుని అనేక కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి, అత్తింటి వేధింపులకు వధువుల బతుకులు బలవుతున్నాయి. సరిగ్గా అలాంటి పరిస్థితులలో.. అత్తింటివారు ఇచ్చిన రూ.31 లక్షల కట్నాన్ని ఒక వరుడు పెళ్లి వేదికపైనే తిరస్కరించడం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఆ గొప్ప మనసున్న వరుడే అవధేశ్ రానా.
శభాష్ అవధేశ్ రానా..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నగ్వా గ్రామానికి చెందిన అవధేశ్ రానా, షాహబుద్దీన్‌పూర్ గ్రామానికి చెందిన అదితి సింగ్‌ల వివాహం నవంబర్ 22న ముజఫర్‌నగర్‌లో జరిగింది. వివాహంలో ముఖ్య ఘట్టమైన గోరా తిలక్ (బహుమతులు ఇచ్చే వేడుక) సందర్భంగా వధువు అదితి కుటుంబ సభ్యులు వరుడికి రూ.31 లక్షల భారీ మొత్తాన్ని కట్నంగా సమరి్పంచడానికి సిద్ధమయ్యారు.
నా మనస్సాక్షికి విరుద్ధం..
సరిగ్గా అప్పుడే.. అక్కడే అవధేశ్ ప్రకటించిన నిర్ణయం అతిథుల్ని నిశ్చేష్టుల్ని చేసింది. ‘క్షమించండి, ఈ డబ్బును నేను స్వీకరించలేను. కట్నం తీసుకోవడం మా సిద్ధాంతాలకు, నా మనస్సాక్షికి విరుద్ధం’.. అని అవదేశ్ స్పష్టం చేశాడు. వేలాది మంది అతిథులు హాజరైన ఆ శుభకార్యంలో, అవధేశ్ చేతులు జోడిస్తూ.. కట్నం మొత్తాన్ని వధువు కుటుంబానికి తిరిగి ఇచ్చేశాడు. ఈ అపూర్వ ఘట్టంతో పెళ్లి పందిరి మొత్తం ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగిపోయింది.
మా బంధం రూపాయితో మొదలైంది..
తన నిర్ణయం గురించి అవధేశ్ మాట్లాడుతూ.. ‘నేను కట్నాన్ని బలంగా వ్యతిరేకిస్తాను. ఇది పూర్తిగా తప్పు. ఈ దురాచారం సమాజం నుంచి పూర్తిగా అంతమవ్వాలి. ఒక తండ్రి తన కూతురి పెళ్లి కోసం జీవితాంతం కష్టపడటం లేదా అప్పులు చేయవలసిన అవసరం లేదు’.. అన్నాడు. ‘మా సంబంధం కేవలం రూపాయి విలువతో మొదలైంది. దానికి మించి నేను ఎలా తీసుకోగలను? రూపాయితో మొదలైంది, రూపాయి దగ్గరే ముగుస్తుంది’.. అని వ్యాఖ్యానించాడు. అవధేశ్ చర్య.. కేవలం నిరసన కాదు, అది దురాచారానికి వ్యతిరేకంగా వినిపించిన ధైర్యగీతం. ఈ తరం యువతరం ఆలోచనా విధానాన్ని మార్చేందుకు ఆయన తీసుకున్న ఆదర్శ నిర్ణయం పెళ్లి బంధానికి సరైన నిర్వచనం.
– సాక్షి, నేషనల్ డెస్క్


