విశాఖలో ట్రెబ్యునల్‌ ప్రతిపాదన లేదు

Union Ministers Reply On MP Vijaya Sai Reddy Questions In Rajya Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రెబ్యునల్‌ ఏర్పాటు ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద లేదని ప్రధానమంత్రి కార్యాలయ మంత్రి డాక్టర్‌ జితేందర్‌ సింగ్‌ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో పదవీ విరమణ చేసిన వారితో సహా వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండడంతో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రెబ్యునల్‌ను విశాఖలో ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా కేంద్రం వద్ద ఉందా అని రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా జవాబిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హైకోర్టు ఉన్నచోట కేంద్ర ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికపైన సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రెబ్యునల్‌ను నెలకొల్పవచ్చు అని తెలిపారు. ట్రెబ్యునల్‌ నిబంధనలకు లోబడి శాశ్వత బెంచ్‌ ఏర్పాటు ఆవశ్యకత, కేసుల పరిష్కారం వంటి అంశాల ప్రాతిపదికపైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వివరించారు.

ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై నిర్ణయాధికారం న్యాయ వ్యవస్థదే
ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై నిర్ణయాధికారం న్యాయ వ్యవస్థదేనని న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు స్పష్టం చేశారు. అప్రాధాన్యమైన అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు అవుతున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో విధానపరమైన నిర్ణయాలు, అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు. వీటిని అరికట్టేందుకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఏవైనా నిర్దిష్టమైన చర్యలు తీసుకోబోతుందా అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి గురువారం రాతపూర్వక జవాబిచ్చారు. పాలనాపరమైన చర్యలకు వ్యతిరేకంగా ఏ పౌరుడైనా న్యాయపరమైన పరిష్కారాన్ని పొందే హక్కును రాజ్యాంగంలో పొందుపరిచినట్లు గుర్తుచేశారు. కాబట్టి ఫలానా పాలనాపరమైన చర్యకు వ్యతిరేకంగా కేసు పెట్టాలా వద్దా అనే స్వేచ్ఛ పౌరుడికి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ హక్కును వినియోగించుకుని దాఖలు చేసే ప్రజా ప్రయోజన వ్యాజ్యం చట్ట పరిధిలో ఉందో లేదో నిర్ణయించే సంపూర్ణ అధికారం న్యాయ వ్యవస్థకు మాత్రమే ఉందని మంత్రి కిరణ్‌ రిజుజు రాతపూర్వకంగా తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top