Omicron Variant: ప్రస్తుతానికి.. ఒమిక్రాన్‌తో ముప్పు లేదు

Union Health Ministry says No threat with omicran - Sakshi

మూడో వేవ్‌పై ఇప్పుడే చెప్పలేం: కేంద్ర ఆరోగ్య శాఖ  

న్యూఢిల్లీ: ఒమిక్రాన్‌ రూపాంతరితం దేశంలోకి కూడా ప్రవేశించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ వైరస్‌తో ఇక థర్డ్‌ వేవ్‌ తప్పదేమోనన్న భయాలు పెరిగిపోతున్నాయి. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వేరియెంట్‌తో ప్రస్తుతానికి మాత్రం ముప్పు లేదని చెబుతోంది. వ్యాక్సిన్‌ వేసుకొని, కోవిడ్‌ నిబంధనలన్నీ పాటిస్తే సరిపోతుందని అంటోంది. కొత్త వేరియెంట్‌తో ప్రజల్లో వచ్చే సందేహాలకు సమాధానాలిచ్చే ప్రయత్నం కేంద్ర ఆరోగ్య శాఖ చేసింది. అవేంటో చూద్దాం.

థర్డ్‌ వేవ్‌ వస్తుందా ?
ఒమిక్రాన్‌ కేసులు కొన్ని రెట్ల వేగంతో పెరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఈ వేరియెంట్‌లో తీవ్ర లక్షణాలేమీ కనిపించలేదు. ఇప్పటికే భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతూ ఉండడం, డెల్టా వైరస్‌ కారణంగా యాంటీ బాడీలు అత్యధికుల్లో వృద్ధి చెందాయని సెరో సర్వేల్లో తేలడంతో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉండే అవకాశాలే ఉన్నాయి. అయితే ఈ విషయం ఇంకా శాస్త్రీయంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?
కరోనాకి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ పాటించాలి. మాస్కు కచ్చితంగా పెట్టుకోవాలి. ఇప్పటివరకు వ్యాక్సిన్‌ వేసుకోకపోతే తప్పనిసరిగా వేయించుకోవాలి. రద్దీ ప్రదేశాలకు వెళ్లడం మానాలి. గాలి , వెలుతురు ధారాళంగా ఉండేలా చూసుకోవాలి.  

ఒమిక్రాన్‌పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు పని చేస్తాయా ?
ప్రస్తుతం లభిస్తున్న కోవిడ్‌ వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ వేరియెంట్‌ని అడ్డుకోలేవని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవు. వైరస్‌ కొమ్ము జన్యువుల్లో చోటు చేసుకున్న కొన్ని మార్పుల కారణంగా టీకా సామర్థ్యం తగ్గే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే వ్యాక్సిన్‌లు వేసుకున్న వారు, కరోనా సోకిన వారిలో ఏర్పడిన యాంటీబాడీలతో కణజాలంలో ఏర్పడే రోగనిరోధక శక్తి ఇంకా కొనసాగుతుంది. అయితే వ్యాధి తీవ్రతని తగ్గించడానికి తప్పనిసరిగా అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి.

ఒమిక్రాన్‌ ఎంత ఆందోళనకరం ?
వైరస్‌లో వస్తున్న మార్పులు, ఎంత వేగంతో వ్యాప్తి చెందుతుంది, రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడం, రీ ఇన్‌ఫెక్షన్‌లు వంటివాటిపై అంచనాలన్నింటినీ క్రోడీకరించి ఈ వైరస్‌ను వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌గా డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది.  కరోనా వైరస్‌ ఉన్నంతకాలం జన్యుమార్పులు, కొత్త రూపాంతారితాలు పుట్టుకురావడం సాధారణంగా జరిగేదే. సాధారణంగా వేరియెంట్లలో ఎక్కువ శాతం ప్రమాదకరం కాదు. ఎక్కువజన్యు మార్పులు జరిగిన వైరస్‌ బలహీన పడుతుంది. ఒమిక్రాన్‌ ఆ కోవలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top