
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో 14 మంది చిన్నారుల మరణానికి కారణమైన దగ్గు మందులపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నదని సంబంధిత అధికారులు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఆరోగ్య కార్యదర్శులు, డ్రగ్ కంట్రోలర్లు పాల్గొనే ఈ సమావేశానికి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అధ్యక్షత వహించనున్నారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం.. ఈ సమావేశంలో ఈ తరహా దగ్గు మందుల నియంత్రణ చర్యలను బలోపేతం చేయడం, దేశంలో ఔషధ ఉత్పత్తుల భద్రత, నాణ్యతను నిర్ధారించడంపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సాధారణంగా సిఫార్సు చేసే దగ్గు మందులపై విశ్లేషణ చేయనున్నారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో 14 మంది చిన్నారులు కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్ తీసుకున్న తర్వాత మూత్రపిండాల వైఫల్యం కారణంగా మరణించారు. ఔషధ నమూనాలలో 48.6 శాతం డైథిలిన్ గ్లైకాల్ ఉందని, ఇది అత్యంత విషపూరిత పదార్థమని అధికారులు తెలిపారు.ఈ ఘటన దరిమిలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం శనివారం కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను నిషేధించింది.
కోల్డ్‌రిఫ్ సిరప్‌కు తమిళనాడులో సంబంధిత ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించగా, దానిలో డైథిలిన్ గ్లైకాల్ అనే రసాయనం ఉందని, దీనిని తీసుకున్నప్పుడు తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం సంభవిస్తుందని, చివరికి మరణానికి కారణమవుతుందని నిపుణులు తెలిపారు.
ఈ నివేదిక అనంతరం మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమిళనాడులోని సిరప్ తయారీ సంస్థ శ్రేసన్ ఫార్మాస్యూటికల్ కు చెందిన ఇతర ఔషధ ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం ప్రకటించింది. దగ్గు మందు కారణంగా చిన్నారులు మరణించిన ఉదంతంలో
చింద్వారాకు చెందిన ఒక వైద్యుడిని అరెస్టు చేశారు.
రాజస్థాన్‌లో..
రాజస్థాన్‌లోని భరత్‌పూర్, సికార్‌లలో డెక్స్ట్రోమెథోర్ఫాన్ హెచ్‌బీఆర్ సిరప్ కారణంగా చిన్నారులు అనారోగ్యం బారిన పడ్డారని తెలియడంతో జైపూర్‌లోని కేసన్ ఫార్మా సరఫరా చేసిన 19 రకాల మందులను నిలిపివేసినట్లు రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వ్‌సర్ తెలిపారు. సిరప్ తీసుకున్న తర్వాత బాధితులు వాంతులు, తల తిరగడం, మూర్ఛపోవడం లాంటి సమస్యలకు లోనయ్యారు. ఈ నేపధ్యంలో ఆరోగ్య శాఖ వెంటనే ఈ ఔషధాలను నిషేధించి, రాష్ట్ర ఔషధ పరీక్షా ప్రయోగశాలకు నమూనాలను పంపిందని మంత్రి తెలిపారు. కాగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా తన తాజా సూచనలో డెక్స్ట్రోమెథోర్ఫాన్‌ను రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇవ్వకూడదని, ఐదేళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న వారికి మాత్రమే సూచించాలని తెలిపింది.
తమిళనాడులో..
మధ్యప్రదేశ్‌లో దగ్గు మందు కారణంగా చిన్నారుల మరణాల దరిమిలా తమిళనాడు ప్రభుత్వం కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను నిషేధించింది. ఈ సంస్థ తయారు చేసిన దగ్గు సిరప్ అమ్మకాలను తమిళనాడు అంతటా నిషేధించినట్లు ఆహార భద్రత- ఔషధ పరిపాలన శాఖ అధికారి ఒకరు చెప్పినట్లు వార్తా సంస్థ టీపీటీఐ తెలిపింది. కాంచీపురం జిల్లాలోని సుంగువర్చత్రంలోని ఈ ఔషధ సంస్థ తయారీ కేంద్రంలో సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించారు. నమూనాలను సేకరించి, సంబంధిత ల్యాబ్‌కు పంపారు. ఈ కంపెనీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరికి మందులను సరఫరా చేసిందని సమాచారం.
ఉత్తరాఖండ్‌లో..
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో దగ్గు సిరప్‌ల కారణంగా పిల్లల మరణాలు సంభవించిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ స్టోర్‌లు, హోల్‌సేల్ డ్రగ్ డీలర్లపై దాడులు చేపట్టింది. ఉత్తరాఖండ్ ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ ఆర్ రాజేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, అన్ని జిల్లాల్లోని డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఔషధ దుకాణాల నుండి దగ్గు సిరప్‌ల నమూనాలను సేకరించి, వాటిని ప్రయోగశాలకు పంపాలని ఆదేశించారు.